● జనరల్ ఆస్పత్రిలో బ్రాంకోస్కోపీ సేవలు ● అందుబాటులోకి రూ.18 లక్షల విలువైన అత్యాధునిక యంత్రం
ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పలో బ్రాంకోస్కోపీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వం రూ.18 లక్షల విలువైన బ్రాంకోస్కోపీ యంత్రాన్ని ఆస్పత్రికి కేటాయించింది. ఊపిరితిత్తులకు సంబంధిత వ్యాధులు, టీబీ నిర్ధారణ, కఫం పరీక్షల కోసం ఈ యంత్రం ఉపయోగపడుతుంది. ఈమేరకు యంత్రాన్ని బుధవారం ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ నరేందర్ ప్రారంభించారు. పల్మనాలజీ వైద్యుడైన ఆయన స్వయంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న వ్యక్తికి మొదటి పరీక్ష చేశారు.
హైదరాబాద్, వరంగల్ తర్వాత..
కార్పొరేట్ ఆస్పత్రుల్లోనే ఉండే బ్రాంకోస్కోపీ సేవలు ప్రభుత్వ విభాగంలో హైదరాబాద్ గాంధీ, ఉస్మానియా, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రుల తర్వాత ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలోనే మొదలయ్యాయి. ఇన్నాళ్లు ఊపిరితిత్తుల సమస్యతో బాధపడే జిల్లా వాసులు ప్రైవేట్ ఆస్పత్రుల్లో లేదా హైదరాబాద్‌లో పరీక్ష చేయించుకోవాల్సి వచ్చేది. ప్రస్తుతం జనరల్ ఆస్పత్రిలో ఆధునిక బ్రాంకోస్కోపీ యంత్రాన్ని సమకూర్చడంతో ఆర్థికంగా భారం తగ్గడమే కాక దూరాభారం తప్పనుంది. ఈ యంత్రం ద్వారా శ్వాసనాళాలు, ఊపిరితిత్తుల్లో బాగాన్ని స్పష్టంగా పరిశీలించొచ్చు. ఎండోస్కోపీ మాదిరిగానే కెమెరా, లైట్ ఉన్న సన్నటి గొట్టాన్ని రోగి ముక్కు, నోటి ద్వారా శ్వాసనాళాల్లోకి పంపించి స్క్రీన్‌పై పరిశీలిస్తూ వ్యాఽధి నిర్ధారిస్తారు. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్లు, కేన్సర్ ఉంటే గుర్తించడం సులువవుతుంది. అలాగే, చిన్నపిల్లలు చాక్‌పీసులు, ఇతర వస్తువులు మింగినా, ఆహారం తీసుకునేటప్పుడు ముళ్లు, ఎముకలు నోట్లోకి వెళ్లినా వాటిని తొలగించేందుకు ఈ మిషన్ ఉపయోగపడుతుంది. అంతేకాక ఊపిరితిత్తుల కేన్సర్, క్షయ వంటి వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించి పరీక్షల కోసం నమూనాలను సేకరించవచ్చు. బ్రాంకోస్కోపీ మిషన్ ద్వారా వివిధ రకాల పరీక్షలకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.15వేల నుంచి రూ.20వేలు అవుతుండగా.. ఇకపై పెద్దాస్పత్రిలో ఉచితంగా లభించనుంది.


