● అంజనాపురంలో పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం ● ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, సీపీ
కొణిజర్ల: సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 20వ తేదీన కొణిజర్ల మండలం అంజనాపురం రానున్నారు. ఇక్కడ గోద్రెజ్ కంపెనీ ఆధ్వర్యాన నిర్మించిన పామాయిల్ ఫ్యాక్టరీని సీఎం ప్రారంభించనున్నారు. ఆ తర్వాత ఆయిల్‌పామ్ రైతులతో ముఖాముఖి మాట్లాడి.. ఇక్కడి నుంచే వైరా నియోజకవర్గ పరిధిలో చేపట్టే అభివృద్ధి పనలకు శంకుస్థాపన చేసే అవకాశముంది. అలాగే, ఆయిల్‌పామ్ సీడ్ ప్లాంటేషన్ పనులు కూడా ప్రారంభించనున్నట్లు సమాచారం.
సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
అంజనాపురంలో గోద్రెజ్ కంపెనీ నిర్మించిన పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి 20వ తేదీన సీఎం రేవంత్‌రెడ్డి రానుండగా.. పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ దివాకర టీఎస్, సీపీ సునీల్‌దత్ అధికారులను ఆదేశించారు. ఫ్యాక్టరీ, పరిసరాలను బుధవారం పరిశీలించిన వారు అధికారులు, కంపెనీ ప్రతినిధులకు సూచనలు చేశారు. సీఎంతో పాటు పలువురు మంత్రులు హాజరవుతారని.. ఈ కార్యక్రమానికి రైతులను కూడా ఆహ్వానిస్తున్నందున ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి చర్యలు తీసుకోవాలన్నారు. వీఐపీలు, ప్రజాప్రతినిధులు, రైతులు, మహిళల కోసం ప్రత్యేకంగా గ్యాలరీలు ఏర్పాటు చేయాలని తెలిపారు. అలాగే, భద్రతా చర్యలు, ట్రాఫిక్ మళ్లింపు తదితర అంశాలపై సూచనలు చేశారు. అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, వైరా ఏసీపీ సారంగపాణి, కొణిజర్ల తహసీల్దార్ అరుణ, గోద్రెజ్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.


