ప్రభుత్వ భూమికి హద్దుల ఏర్పాటు | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ భూమికి హద్దుల ఏర్పాటు

Jul 7 2026 12:21 AM | Updated on Jul 7 2026 12:21 AM

సత్తుపల్లిటౌన్‌: సత్తుపల్లి హనుమాన్‌నగర్‌లో వేశ్యకాంతల చెరువుకు ఆనుకుని ఉన్న గ్రామకంఠం, ప్రభుత్వ భూమి హద్దుల వెంట అధికారులు సోమవారం ట్రెంచ్‌ ఏర్పాటు చేశారు. ఇక్కడ సుమారు 4.20 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇటీవల రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ స్థలాన్ని పరిశీలించగా, అన్యాక్రాంతం కాకుండా హద్దులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీంతో తహసీల్దార్‌ సత్యనారాయణ పర్యవేక్షణలో సర్వేయర్‌ నాగు, ఆర్‌ఐ ఉమామహేశ్వరరావు, మున్సిపల్‌ కమిషనర్‌ కె.నర్సింహ జేసీబీతో ట్రెంచ్‌ కొట్టించి హద్దురాళ్లు ఏర్పాటు చేశారు.

ఖమ్మం డైట్‌ ప్రిన్సిపాల్‌గా వాసంతి

ఖమ్మం సహకారనగర్‌: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీఈఓ డి.వాసంతి ఖమ్మం డైట్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రిన్సిపాల్‌గా వ్యవహరించిన ఖమ్మం డీఈఓ చైతన్యజైనీ సెలవులో వెళ్లడంతో భద్రాద్రి డీఈఓ వాసంతికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా కాలేజీకి వచ్చిన ఆమెకు ఉద్యోగులు జీఎస్‌.ప్రసాద్‌, బాలమురళి, పద్మ, నగేష్‌, మాధవరావు, రామకృష్ణారెడ్డి తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

ఆలయాల్లో

భారతీ స్వామి పూజలు

ఖమ్మంగాంధీచౌక్‌: శృంగేరి పీఠాధిపతి శ్రీశ్రీ విధుశేఖర భారతీ స్వామి సోమవారం ఖమ్మంలోని పలు ఆలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేసవస్థానం(గుట్ట), కమాన్‌ బజార్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాల్లో పూజలు చేశారు. అనంతరం ఆలయాల ప్రాశస్త్యం, ప్రత్యేకతలపై భారతీస్వామి భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ఈ కార్యక్రమాల్లో ఆలయాల ఈఓలు, అర్చకులు, అభివృద్ధి కమిటీల ప్రతినిధులు పాల్గొన్నారు.

గ్యాస్‌ వాహనం అడ్డగింత

కారేపల్లి: సిలిండర్‌ ధర కంటే అదనంగా డబ్బు వసూళ్లు చేస్తున్నారంటూ హెచ్‌పీ గ్యాస్‌ సిలిండర్ల వాహనాన్ని మండలంలోని వెంకిట్యాతండా గ్రామస్తులు సోమవారం అడ్డుకున్నారు. సిలిండర్‌ ధర రూ.981 ఉంటే డెలివరీ చార్జి పేరిట రూ.120 నుంచి రూ.200 వరకు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఈమేరకు వాహనాన్ని అడ్డుకుని సిబ్బందితో వాగ్వాదానికి దిగగా, తీరు మార్చుకోవాలని సూచించి పంపించారు.

బస్సులో అస్వస్థత..

డ్రైవర్‌ చొరవతో ఆస్పత్రికి

నేలకొండపల్లి: ఆర్టీసీలో ప్రయాణిస్తున్న ఓ మహిళ అస్వస్థతకు గురికాగా నేరుగా బస్సును ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. కోదాడ నుంచి సోమవారం ఖమ్మం వెళ్తున్న బస్సులో మహబూబాబాద్‌ జిల్లా ఎడ్లర్లకు చెందిన ఎలగాల కీతమ్మ – వెంకన్న ఉన్నారు. నేలకొండపల్లి దాటాక కీతమ్మ అస్వస్థతకు గురై బస్సులో పడిపోయింది. దీంతో డ్రైవర్‌కు చెప్పగా ఆయన ప్రభుత్వ హస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స చేశాక కీతమ్మ కోలుకోవడంతో అదే బస్సులో తిరిగి బయలుదేరారు. ఈ సందర్భంగా సహకరించిన డ్రైవర్‌కు కీతమ్మ భర్తతో పాటు ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement