గ్యాస్ కోసం వినియోగదారుల బారులు
ఏజెన్సీ సిబ్బంది నిర్లక్ష్యంపై నిరసన
వైరా: వైరా మున్సిపాలిటీ పరిధి సోమవరం సమీపాన ఉన్న ఇండే గ్యాస్ కంపెనీ గోదాం వద్ద ఉగాది పండుగ రోజైన గురువారం కూడా సిలిండర్ల కోసం వినియోగదారులు పడిగాపులు కాశారు. కాణిపాకం పేరుతో నిర్వహిస్తున్న ఈ ఏజెన్సీ గోదాంకు ఇటీవల కొరతతో సిలిండర్లు రాలేదని చెబుతుండగా వినియోగదారులు నిజమేనని నమ్మారు. కానీ ఏజెన్సీ నిర్వాహకులు కామన్ పాయింట్ నుంచి తెప్పించి పలువురు సరఫరా చేస్తుండగా, ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వారికి మాత్రం ఇవ్వడం లేదు. దీంతో ఉగాది రోజు వచ్చిన వారికి స్టాక్ లేదని సిబ్బంది సమాధానం చెప్పడంతో వైరా – జగ్గయ్యపేట జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. ఫలితంగా గంట పాటు వాహనాలు నిలిచిపోయాయి. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులతో మాట్లాడడడంతో రెండు రోజుల్లో అందరికీ గ్యాస్ సరఫరా చేస్తామని చెప్పగా ఆందోళన విరమించారు. ఈ విషయంపై ఏజెన్సీ ప్రతినిధులతో మాట్లాడేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.


