మధిర: మధిర మండలం మాటూరుపేటలో గురువారం ఉగాది ఉత్సవాలను ప్రారంభించారు. రెండు రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు. ఈమేరకు ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారు కూడా హాజరయ్యేలా చూడడం, ఇక్కడి ఉత్సవాల సమాచారాన్ని చేరవేసేలా ‘మన జన్మభూమి– మాటూరుపేట’ పేరుతో వాట్సాప్ గ్రూప్ రూపొందించారు. ఈ గ్రూపులో గ్రామ పెద్దలతో పాటు వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారిని చేర్చారు. తొలిరోజైన గురువారం పలు ప్రాంతాల నుంచి స్థానికులు కుటుంబాలతో సహా చేరుకోగా ఉగాది ఉత్సవాలను గ్రామ సర్పంచ్ చిలివేరు పూర్ణమ్మ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చిలువేరు బుచ్చిరామయ్య, టీవీ.రెడ్డి, మాదల రామారావు, శ్రీనివాసరావు, తలపురెడ్డి నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి పంపిణీ అనంతరం రాత్రి మాయాబజార్ పౌరాణిక నాటకాన్ని ప్రదర్శించారు. ఇక రెండో రోజైన శుక్రవారం వివిధ రంగాల్లో సేవలందించిన వారికి ఉగాది పురస్కారాలు అందించాక తల్లిదండ్రులకు పాదపూజ నిర్వహిస్తారు. చివరగా మాటూరుపేట కల్చరల్ ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన చింతామణి సాంఘిక పద్యనాటకం ప్రదర్శన ఏర్పాటుచేశారు.


