ఖమ్మంఅర్బన్: ఖమ్మం వెలుగుమట్లలోని భూదాన్ భూముల పేరుతో తమ నుంచి డబ్బు వసూలు చేసి మోసం చేశారంటూ మరికొందరు గురువారం నగర ఏసీపీ రమణమూర్తికి ఫిర్యాదు చేశారు. ఈమేరకు 38 మంది ఫిర్యాదు చేయగా ఏసీపీ వివరాలు వెల్లడించారు. ఒక్కొక్కరి వద్ద రూ.50 వేల నుంచి రూ.5 లక్షల చొప్పున రూ.54.13 లక్షల మేర పోలబోయిన ముత్తయ్య వసూలు చేసినట్లు ఫిర్యాదు అందిందని తెలిపారు. కాగా, సదరు ముత్తయ్య ఇచ్చిన రశీదులు భూదాన్ వినోభాబావే వెల్ఫేర్ సొసైటీ, యూసీసీఆర్‌ఐ(ఎంఎల్) పార్టీ, పి.అరవింద్ పేరుతో ఉన్నాయని వెల్లడించారు. ఇప్పటికే ముత్తయ్యను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన నేపథ్యాన విచారణ కోసం ఖమ్మం అర్బన్ పోలీసులు కస్టడీ కోరారని తెలిపారు.
తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు ఆపాలి
భూముల పేరుతో వసూలు చేశారంటూ తప్పుడు కేసులు పెడుతున్న పోలీసులు అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ(ఓపీడీఆర్) ఉపాధ్యక్షుడు సుంకర ఆందోళన వ్యక్తం చేశారు. వెలుగుమట్ల నవోదయ భూదాన్ కాలనీలో నివసిస్తున్న వేయి కుటుంబాల ఇళ్లను కూల్చివేయడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రాగా, అందులో నుంచి బయటపడేందుకు తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాక పీడీ యాక్ట్ పెడతామని బెదిరిస్తున్నారని తెలిపారు. భూదాన్ భూములను ఆక్రమించేందుకు కొందరు స్వార్థ ప్రయోజనాలతో చేస్తున్న తప్పుడు ఆరోపణల ను ప్రజలు నమ్మొద్దని ఆయన ఓప్రకటనలో కోరారు.
ఏసీపీని ఫిర్యాదుచేసిన భూదాన్ బాధితులు


