ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మం త్రీటౌన్‌లోని రంగనాయకుల గుట్టపై ఉన్న శ్రీకృష్ణసాయి ఆశ్రమాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్ గురువారం దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా జడ్జి దంపతులను ఆశ్రమం నిర్వహకులు సత్కరించారు. అలాగే, ఆర్యవైశ్య సంఘం బాధ్యులు పసుమర్తి సీతారామచంద్రరావు, గుమ్మడివల్లి శ్రీనివాస్ కూడా పూజలు చేయగా, ఆశ్రమం చైర్మన్ లగడపాటి రామారావు, కార్యదర్శి నాగమణితో పాటు మధు, సంజయ్, గ్రంధి మోహన్ రావు, కన్నం రమణ తదితరులు పాల్గొన్నారు.
ఆలయ నిర్మాణానికి రూ.7లక్షల విరాళం
ఏన్కూరు: మండల కేంద్రంలో కోదండ రామాలయం నిర్మాణానికి పలువురు దాతలు గురువారం రూ.7.23లక్షలకు పైగా విరాళాలు అందజేశారు. గ్రామానికి చెందిన మాదినేని బాబు రూ.2లక్షలు, పొన్నం హరికృష్ణ రూ.1,23,456, అమరనేని వెంకటేశ్వరావు రూ.లక్ష, చిట్టిని రామారావు రూ.50,116తో పాటు వేముల సత్యనారాయణ, తాళ్లూరి నర్సింహరావు, అమరనేని వీరభద్రం, మేడ ధర్మారావు, మాదినేని రమేష్ రూ.50 వేల చొప్పున అందజేశారని ఆలయ కమిటీ బాధ్యులు వెల్లడించారు.
కట్లేరుకు సాగర్ జలాలు విడుదల
ఎర్రుపాలెం: మండలంలోని కట్లేరుతో పాటు మామునూరుపేట చెరువులకు గురువారం సాగర్ జలాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మధిర మార్కెట్ చైర్మన్ బండారు నర్సింహారావు మాట్లాడుతూ విసన్నపేట, మైలవరం బ్రాంచ్ కెనాళ్ల ద్వారా సుమారు 500 క్యూసెక్కుల నీటిని తాగు, సాగు అవసరాల కోసం మామునూరుపేట చెరువుకు విడుదల చేసినట్లు తెలిపారు. అలాగే, కొండ్రుపాడు ఎస్కేప్ నుంచి 100 క్యూసెక్కుల నీటిని కట్టేరులోకి విడుదల చేశామని వెల్లడించారు. నాయకులు అనుమోలు వెంకట కృష్ణారావు, శీలం వెంకట్రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పేకాటరాయుళ్ల అరెస్ట్
మధిర: మధిర సమీపాన రాయపట్నం ఏటిలో పలువురు పేకాట ఆడుతున్నారనే సమాచారంతో గురువారం టౌన్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పది మందిని అదుపులోకి తీసుకుని రూ.5,500 నగదు, నాలుగు బైక్‌లు స్వాధీనం చేసుకున్నట్లు మధిర టౌన్ ఇన్‌స్పెక్టర్ డీ.రమేష్ తెలిపారు. కాగా, ఎక్కడైనా పేకాట స్థావరాలు ఏర్పాటుచేసినట్లు తెలిస్తే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు.
1,020 మె.టన్నుల యూరియా
చింతకాని: చింతకాని మండలం పందిళ్లపల్లి రేక్ పాయింట్‌కు సీఐఎల్ కంపెనీకి చెందిన 1,020.80 మెట్రిక్ టన్నుల యూరియాతో పాటు 20.20.0.13 కాంప్లెక్స్ ఎరువులు గురువారం చేరాయి. వీటిని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు సరఫరా చేయడంతో పాటు కొంత మేర బఫర్ స్టాక్‌గా నిల్వ చేసినట్లు డీఏఓ పుల్లయ్య తెలిపారు.


