రైతులకు ఆదాయ వనరు
పీఎం కుసుమ్ పథకం ద్వారా కేంద్రం తోడ్పాటు
ఒక మెగావాట్ ఉత్పత్తితో ఏటా రూ.55 లక్షలు
ఖమ్మంవ్యవసాయం: బీడు భూములే కదా అని వదిలేయకుండా పంట పండించే రోజులు వచ్చేశాయి! అయితే, ఇది సాధారణ పంట కాకుండా కరెంట్ పంట కావడం విశేషం. సోలార్ విద్యుత్ ఉత్పత్తి, ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ఇళ్లపై సూర్యఘర్ పథకం ద్వారా సౌర విద్యుత్ ప్లాంట్లు మంజూరు చేస్తుండగా, అన్నదాతల కోసం ప్రత్యేక పథకాన్ని అమలుచేస్తోంది. పంటల సాగుకు పనికి రాకుండా నిష్ప్రయోజనంగా ఉన్న భూముల ద్వారా ఆదాయం లభించేలా ప్రధాన మంత్రి కుసుమ్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకంపై రెడ్–కో(రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్) సంస్థ ద్వారా రైతులకు అవగాహన కల్పించడంతో పట్టాలు కలిగిన బీడు, బంజర భూముల్లో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకొస్తున్నారు.
56 మంది.. 86 మెగావాట్లు
ఉమ్మడి జిల్లాలో పీఎం కుసుమ్ పథకం కింద సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ఇప్పటి వరకు 56మంది రైతులు ముందుకొచ్చారు. తమకు ఉన్న బీడుభూముల్లో నిర్మాణం వ్యయం ఆధారంగా సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 86 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్ద్యం కలిగిన ప్లాంట్లు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇందులో ఖమ్మం జిల్లాలో 43 మంది రైతులు 70 మెగావాట్ల సామర్ద్యం కలిగిన ప్లాంట్లు నిర్మిస్తుండగా, భద్రాద్రి జిల్లాలో 13 మంది 16 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సోలార్ ప్లాంట్ల ఏర్పాటులో నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం జూపెడలో బీరవల్లి శ్రీనివాసరావు తన భూమిలో 2 మెగావాట్ల సామర్ద్యం కలిగిన ప్లాంట్‌ను ఏర్పాటుచేయడంతో ఇటీవలే గ్రిడ్‌కు అనుసంధానం చేశారు.
సాగుకు పనికిరాని, నీటి వనరులు లేక వృథాగా వదిలేస్తున్న భూముల్లో రైతులు పీఎం కుసమ్ పథకం ద్వారా సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుచేసుకోవచ్చు. తద్వారా నిరంతరం ఆదాయం సమకూరుతుంది. దరఖాస్తు ఈనెల 31 వరకు అవకాశం ఉన్నందున అర్హులైన రైతులు సద్వినియోగం చేసుకోవాలి.
– పి.అజయ్‌కుమార్, మేనేజర్, రెడ్‌కో ఉమ్మడి జిల్లా
బీడు భూముల కలిగిన రైతులు ఇన్నాళ్లు ఏ పంట పండించలేక వదిలేస్తున్నారు. ఇప్పుడు ఆయా భూముల్లో కేంద్రం సోలార్ ప్లాంట్ల ఏర్పాటును ప్రోత్సహిస్తుంది. ఒక మెగావాట్ సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు 3.20 నుంచి 4 ఎకరాల వరకు భూమి కలిగి ఉండాలి. ప్లాంట్ ఏర్పాటుకు రూ. 3.20 కోట్ల నుంచి రూ.3.60 కోట్లు ఖర్చవుతుండగా పీఎం కుసుం పథకం ద్వారా 70 – 85 శాతం రుణ సౌకర్యాన్ని 12ఏళ్ల కాలపరిమితితో కల్పిస్తారు. 15 – 30 శాతం తమ వాటా చెల్లించాలి. 12 ఏళ్ల కాలపరిమితితో రుణసౌకర్యం కల్పిస్తారు. ప్లాంట్ ఏర్పాటుతో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ రైతుల నుంచి ఒప్పదం కుదుర్చుకుంటుంది. తద్వారా ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తితో రైతులకు ఏటా రూ.53 లక్షల నుంచి రూ.55 లక్షల ఆదాయం సమకూరుతుంది.
సోలార్ ప్లాంట్ల ఏర్పాటుతో రైతులకు ఆదాయం


