ఖమ్మంగాంధీచౌక్: ఇటీవల ప్రమాదానికి గురైన ఖమ్మంకు చెందిన ఫొటోగ్రాఫర్ రాముకు ఫొటోగ్రాఫర్ల అసోసియేషన్ తరఫున చేయూతనిచ్చారు. ప్రమాదంలో ఆయన ముఖం దెబ్బతినగా శస్త్రచికిత్స కోసం అసోసియేషన్ బాధ్యులు రూ.66వేల నగదును రాముకు శుక్రవారం అందజేశారు. ఫొటోగ్రాఫర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వెంకట్‌తో పాటు తిరుపతిరావు, రఘు, శ్రీనివాసరావు, సుధాకర్‌రావు, బండారు శేషగిరిరావు, తిరుపతిరావు పాల్గొన్నారు.
హైదరాబాద్‌కు ప్రతీరోజు ఆరు ఏసీ బస్సులు
సత్తుపల్లిటౌన్: వేసవి దృష్ట్యా సత్తుపల్లి డిపో నుంచి ప్రతీరోజు హైదరాబాద్‌కు ఆరు ఏసీ బస్సులు నడిపిస్తున్నట్లు డిపో మేనేజర్ గురిజాల లక్ష్మీనారాయణ తెలిపారు. సత్తుపల్లి నుంచి ఉదయం 7.45, 9.15, 10గంటలకు, రాత్రి 9, 9.45, 10.30 గంటలకు ఏసీ సర్వీసులు ఉంటాయని పేర్కొన్నారు. తిరిగి బీహెచ్‌ఈఎల్ నుండి సత్తుపల్లికి ఉదయం 8, 9, 10గంటలకు, రాత్రి 9, 10, 11గంటలకు బస్సులు బయలుదేరతాయని తెలిపారు. ఇక సత్తుపల్లి నుంచి తిరుపతికి మధ్యాహ్నం 3గంటలకు, తిరుపతి నుంచి సత్తుపల్లికి మధ్యాహ్నం 3గంటలకు సూపర్ లగ్జరీ సర్వీస్ ఉంటుందని, ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్‌కు దరఖాస్తుల ఆహ్వానం
ఖమ్మంమయూరిసెంటర్: టీజీఎస్ ఆర్టీసీ ఖమ్మం రీజియన్‌లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్‌నకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆర్‌ఎం సరిరామ్ తెలిపారు. బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ, బీఏ, ఇంజనీరింగ్ / డిప్లమా తదితర డిగ్రీ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. 2021 తర్వాత డిగ్రీ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆసక్తి, అర్హత ఉన్న వారు కేంద్రప్రభుత్వ ఎన్‌టీఏ 2.0 పోర్టల్ https:// nats. education. gov. in ద్వారా ఈనెల 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికై న వారికి ఆర్టీసీ ఖమ్మం రీజియన్ పరిధిలోని డిపోలు, వర్క్‌షాపుల్లో అప్రెంటిస్‌షిప్ శిక్షణ ఇస్తామని ఆర్‌ఎం తెలిపారు.
జాతీయస్థాయి
ఆర్చరీ టోర్నీకి ఎంపిక
ఖమ్మం స్పోర్ట్స్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయపూర్‌లో జరగనున్న గిరిజన ఖేలో ఇండియా జాతీయ స్థాయి ఆర్చరీ టోర్నీకి ఉమ్మడి జిల్లా నుంచి నలుగురు క్రీడాకారులు ఎంపికయ్యా రు. ఈ మేరకు బి.సంజనశ్రీ, కొమరం అశ్విత్‌దొర, ఈ.ఆనంద్, కాయం లక్ష్మణ్ పోటీలకు ఎంపిక కాగా, అక్కడ ప్రతిభ కనబరిస్తే మరింత మెరుగైన శిక్షణ అందే అవకాశముంది. క్రీడాకారులను ఖమ్మం, భద్రాద్రి డీవైఎస్‌ఓలు టి.సునీల్‌రెడ్డి, పరంధామరెడ్డి, ఆర్చరీ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సారంగపాణి, పుట్టా శంకరయ్య అభినందించారు.
విదేశాల్లో వలస
కార్మికులకు సాయం
ఖమ్మంమయూరిసెంటర్: విదేశాల్లో ఉపాధి కోసం వెళ్లిన తెలంగాణ వలస కార్మికుల గణాంకాలు, రాష్ట్రాల వారీగా వివరాలు వెల్ల డించాలని ఖమ్మం లోక్‌సభ సభ్యుడు రామసహాయం రఘురాంరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు శుక్రవారం లోక్‌సభలో ఆయన ప్రశ్నించగా కేంద్ర విదేశీ వ్యవహారాలు, టెక్స్‌టైల్స్ శాఖల సహాయ మంత్రి పబిత్ర మార్గరీటా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. విదేశాల్లో ఉపాధి, ఉద్యోగాల కోసం వెళ్లే కార్మికుల వివరాలను ఈ–మైగ్రేట్ పోర్టల్ ద్వారా నమోదు చేస్తున్నట్లు తెలిపారు. గత ఐదేళ్లలో 46,614 మంది పురుషులు, 858 మంది మహిళా కార్మికులు వెళ్లారని వెల్లడించారు. అక్కడ ఇబ్బందులు ఎదుర్కొనే భారతీయులకు ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ ద్వారా అవసరమైన వసతి, వైద్యం, న్యాయ సాయమే కాక స్వదేశానికి రప్పించడం వంటి సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.
కుక్కదాడిలో ఇద్దరికి గాయాలు
వైరారూరల్: మండలంలోని ముసలిమడుగులో శుక్రవారం ఓ పిచ్చి కుక్క స్వైరవిహారం చేసింది. గ్రామానికి చెందిన జోజి, చైతన్య రహదారి వెంట నడిచి వెళ్తుండగా పిచ్చికుక్క వారిపై దాడి చేసింది. ఘటనలో గాయపడిన వారికి కుటుంబీకులు సోమవరం పీహెచ్‌సీలో వైద్యం చేయించారు.


