నేలకొండపల్లి: నేలకొండపల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని మంగళవారం ప్రారంభించారు. పాఠశాల 1989 బ్యాచ్ పూర్వ విద్యార్థులు రూ.1.70 లక్షల వ్యయంతో భక్తరామదాసు స్మారక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో 2,500 పుస్తకాలను సమకూర్చగా రిటైర్డ్ అసిస్టెంట్ కలెక్టర్ గండికోట భాస్కర్ పూర్వ విద్యార్థులతో కలిసి లైబ్రరీని ప్రారంభించారు. ‘సాక్షి’దినపత్రిక కార్టూనిస్ట్ పి.శంకర్ సతీమణి మంగ పాఠశాల పూర్వ విద్యార్థిని కావడంతో ఆయన సమకూర్చిన పుస్తకాలు, పలువురు ప్రముఖుల క్యారికేచర్లను నిర్వాహకులకు అందజేశారు. అనంతరం ఎంఈఓ బి.చలపతిరావు మాట్లాడుతూ.. విద్యార్థుల కోసం గ్రంథాలయం ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. హెచ్‌ఎం గోపగాని రమేశ్, సర్పంచ్ వెంకటలక్ష్మి, వార్డు సభ్యుడు వంగవీటి పవన్, పూర్వ విద్యార్థులు రేలా నరసింహారెడ్డి, పుల్లారావు, పాపారావు తదితరులు పాల్గొన్నారు.
పుస్తకాలు సమకూర్చిన
‘సాక్షి’ కార్టూనిస్ట్ శంకర్


