మహిళలు ధైర్యంగా ముందడుగు వేయాలి | - | Sakshi
Sakshi News home page

మహిళలు ధైర్యంగా ముందడుగు వేయాలి

Mar 11 2026 7:32 AM | Updated on Mar 11 2026 7:32 AM

ఖమ్మం లీగల్‌: సమాజం అభివృద్ధి చెందాలంటే మహిళలు మరింత ధైర్యంగా ముందుడుగు వేయడం అవసరమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్‌ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా న్యాయమూర్తుల దినోత్సవం సందర్భంగా మంగళవారం ఖమ్మంలో న్యాయవాది పరిషత్‌ ఆధ్వర్యాన నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. ఒకప్పుడు ఇంటికే పరిమితమైన మహిళలు ఇప్పుడు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లోనే కాక శాస్త్ర, సాంకేతిక రంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు. అయితే, మహిళలకు అవకాశాలు ఇవ్వడంతో పాటు వారి నిర్ణయాలు గౌరవించడం కూడా ముఖ్యమేనని అందరూ గుర్తించాలని సూచించారు. ఈ సమావేశంలో న్యాయాధికారులు ఉమాదేవి, అపర్ణ, అర్చనాకుమారి, రాంప్రసాద్‌రావు, శ్రీనయ్య, కల్పన, శివరంజని, మురళీమోహన్‌, దీప, బిందుప్రియ, నాగలక్ష్మి, న్యాయవాది పరిషత్‌ అధ్యక్ష, కార్యదర్శులు సత్యప్రసాద్‌, రంగారావుతో పాటు విజయశాంత, పద్మావతి, రమాదేవి, లలిత తదితరులు పాల్గొన్నారు.

మూగజీవాలకు అంత్యక్రియలు

ఖమ్మంఅర్బన్‌: ఎవరూ లేని అనాథలకే కాక మూగజీవాలకు కూడా అంత్యక్రియలు నిర్వహించిన అన్నం ఫౌండేషన్‌ చైర్మన్‌ శ్రీనివాసరావు పలువురి మన్ననలు అందుకున్నారు. హైదరాబాద్‌ మల్కాజగిరికి చెందిన బారువ సుమిత్‌, ఆయన తల్లి ఉమ పదేళ్లుగా వీధి శునకాలకు అన్నం సమకూరుస్తున్నారు. ఇందులో రెండు వృద్ధ శునకాలను వారు ఖమ్మంలోని యానిమల్‌ నేచర్‌ ఆశ్రమానికి అప్పగించగా ‘బ్రౌనీ’ పేరు కలిగిన శునకం మంగళవారం మృతి చెందింది. ఈమేరకు శ్రీనివాసరావు ఆశ్రమం నిర్వాహకురాలు మేకల పద్మతో కలిసి శునకానికి అంత్యక్రియలు నిర్వహించారు. అలాగే, విద్యుదాఘాతంతో మృతి చెందిన రెండు పక్షులకు సైతం అంత్యక్రియలు నిర్వహించినట్లు తెలిపారు.

ఖమ్మం మార్కెట్‌లోకి నిస్సాన్‌ ‘గ్రావైట్‌’

ఖమ్మంఅర్బన్‌: నిస్సార్‌ కంపెనీ కొత్తగా రూపొందించిన కొత్త గ్రావైట్‌ 7 సీటర్‌ కారును ఖమ్మం మార్కెట్‌లోకి విడుదల చేశారు. ఖమ్మంలోని వీవీవీ మోటార్స్‌లో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో కారును ఎంవీఐలు జే.ఎన్‌.శ్రీనివాసరావు, స్వర్ణలత విడుదల చేసి మాట్లాడారు. వాహనం నడిపేటప్పుడు తప్పక సీట్‌బెల్ట్‌ ధరించి, పరిమిత వేగం దాటొద్దని సూచించారు. ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తే సమాజానికి మంచి సేవ చేసినట్లేనని పేర్కొన్నారు. వీవీసీ మోటార్స్‌ అధినేత వంకాయలపాటి వెంకటరాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ పెట్రోల్‌, సీఎన్‌జీ వేరియంట్లలో లభించే నిస్సాన్‌ గ్రావైట్‌లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయని, ఎక్స్‌ షోరూం ధర రూ.5.65 లక్షల నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. అలాగే ఉగాది వరకు సర్వీస్‌పై ప్రత్యేక డిస్కౌంట్‌ అందిస్తున్నట్లు తెలిపారు.

విద్యార్థుల రాస్తారోకో

దుమ్ముగూడెం: మండలంలోని కె.రేగుబల్లి–2 పాఠశాలకు చెందిన విద్యార్థులు మంగళవారం చర్ల – భద్రాచలం ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. పాఠశాల హెచ్‌ఎం భారతిని ఇక్కడే విధుల్లో కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. కాగా, తోటి విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేసుకోవడానికి కారణమైన ఆమె కోసం ధర్నా చేస్తారా అంటూ గ్రామస్తులు వచ్చి విద్యార్థులను పాఠశాలకు తీసుకుని వెళ్లారు. ఈ పాఠశాలలో కొన్ని రోజుల క్రితం హెచ్‌ఎం, సిబ్బంది వేధింపులతో ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. కాగా ఘటనపై ఐటీడీఏ అధికారులు విచారణ సాగిస్తున్నారు. పాఠశాలలో హెచ్‌ఎం, ఉపాధ్యాయులు లేని సమయంలో విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి రాస్తారోకో చేయడం గమనార్హం. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకునే లోగానే విద్యార్థులు పాఠశాలకు వెళ్లిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement