త్వరలోనే సమీకృత కార్యాలయాల సముదాయం | - | Sakshi
Sakshi News home page

త్వరలోనే సమీకృత కార్యాలయాల సముదాయం

Mar 11 2026 7:32 AM | Updated on Mar 11 2026 7:32 AM

కల్లూరురూరల్‌: అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకేచోట ఉండేలా కల్లూరులో సమీకృత ప్రభుత్వ కార్యాలయాల సముదాయం నిర్మించనున్నట్లు సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్‌ మట్టా రాగమయి తెలిపారు. కల్లూరులో మంగళవారం జరిగిన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ సమావేశంలో ఆమె మాట్లాడుతూ సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం సహా అన్ని శాఖల కార్యాలయాలను ఒకేచోట నిర్మిస్తామన్నారు. అలాగే, కల్లూరు మున్సిపాలిటీకి నూతన భవన నిర్మాణానికి ప్రతిపాదించినట్లు తెలిపారు. కాగా, మున్సిపాలిటీకి మంజూరైన రూ.15 కోట్లతో చేపట్టే పనులకు త్వరలో టెండర్లు పిలుస్తామని చెప్పారు. అనంతరం డంప్‌ యార్డ్‌ ప్రతిపాదిత స్థలాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ చైర్మన్‌ ధరావత్‌ మోహన్‌నాయక్‌, మార్కెట్‌ చైర్మన్‌ భాగం నీరజాదేవి, ఎంపీడీఓ చంద్రశేఖర్‌, తహశీల్దార్‌ పులి సాంబశివుడు, మున్సిపాలిటీ మేనేజర్‌ నందిశెట్టి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

● మహిళ ప్రగతికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని ఎమ్మెల్యే రాగమయి తెలిపారు. కల్లూరులో జిల్లా ఆర్యవైశ్య మహాసభ మహిళా సంఘం ఆధ్వర్యాన నిర్వహించిన మహిళా దినోత్సవ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. మహిళా ప్రజాప్రతినిధులను సన్మానించడంతో పాటు దివ్యాంగుడికి వీల్‌చైర్‌ అందజేశాక ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ప్రతిభ చాటుతున్నారని తెలిపారు. సంఘం అధ్యక్షురాలు దోసపాటి సంధ్యారాణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు పసుమర్తి చందర్‌రావు, మున్సిపల్‌, మార్కెట్‌ చైర్మన్లు మోహన్‌నాయక్‌, భాగం నీరజాదేవితో పాటు వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్మలాజ్యోతి, ఎం.రూప, పత్తిపాటి నివేదిత, సుష్మ, పాల్వాయి కనకపల్లి, సామ్రాజ్యలక్ష్మి, శీలం కోటేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement