నేలకొండపల్లి: ఇంటర్ పరీక్షలు రాసి రెండు బైక్‌లపై వస్తున్న విద్యార్థులు కారును ఢీకొట్టడమే కాక పరస్పరం ఢీకొనడంతో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. నేలకొండపల్లి మండలం అనంతనగర్– నేలకొండపల్లి మధ్య శుక్రవారం ఈ ప్రమాదం జరిగింది. కోరట్లగూడెంకు చెందిన బచ్చలకూరి అభిరామ్, అమ్మగూడెంకు చెందిన వాసంశెట్టి ఉదయ్, ఆరెగూడెంకు చెందిన బోయిన ఉదయ్ నేలకొండపల్లిలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్ష రాసి బైక్‌పై ఇళ్లకు బయలుదేరారు. సదాశివాపురానికి యండ్రాతి విశాల్, జె.జశ్వంత్, కొంగరకు చెందిన పొట్టా ఆకాష్ అనంతనగర్‌లో పరీక్షరాసి మరో బైక్‌పై వెళ్తున్నారు. వీరి బైక్‌లు అనంతనగర్ – నేలకొండపల్లి మధ్య మూలుమలపు సమీపానికి చేరగా నేలకొండపల్లి నుంచి కూసుమంచి వైపు వెళ్తున్న కారును ఢీకొట్టి ఆపై పరస్పరం ఢీకొన్నా యి. దీంతో బైక్‌లపై వెళ్తున్న ఆరుగురు విద్యార్థులు ఎగిరిపడడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో అభిరామ్ పరిస్థితి విషమంగా ఉండగా, మిగతా వారికి సైతం గాయాలై స్పృహ కోల్పోవడంతో స్థానికులు పాకనాటి కన్నారెడ్డి, బచ్చలకూరి నాగరాజు తదితరులు సీపీఆర్ చేస్తూ 108లో నేలకొండపల్లి ప్రభు త్వ ఆస్పత్రికి అక్కడి నుంచి ఖమ్మం తరలించారు. క్షతగాత్రులను తహసీల్దార్ వి.వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ ఎం.యర్రయ్య పరామర్శించారు.
ఇంటర్ పరీక్ష రాసి వస్తుండగా ఘటన


