లక్ష్యం.. నూరు శాతం
● ఎస్సెస్సీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు ● ప్రత్యేక తరగతులతో ఫలితాల మెరుగుపై ఆశాభావం ● ‘సాక్షి’ ఇంటర్వ్యూలో జిల్లా విద్యాశాఖాధికారి చైతన్యజైనీ
ఖమ్మం సహకారనగర్: పదో తరగతి ఫలితాల్లో జిల్లాను ముందంజలో నిలిపేలా ప్రణాళికాయుతంగా ముందుకు సాగుతున్నామని జిల్లా విద్యాశాఖాధికారి చైతన్య జైనీ వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రతీ విద్యార్థి చదువుపై దృష్టి సారించడమే కాక వారి సందేహాల నివృత్తికి ప్రత్యేక తరగతులు దోహదపడుతున్నాయని తెలిపారు. ఎస్సెస్సీ విద్యార్థులకు బోధన, పరీక్షలకు చేస్తున్న ఏర్పాట్లను ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ వివరాలు డీఈఓ మాటల్లోనే...
సౌకర్యాలు.. అల్పాహారం
ఎస్సెస్సీ విద్యార్థులు ఎలాంటి ఇబ్బంది పడకుండా ప్రభుత్వం సౌకర్యాలు కల్పించింది. అల్పాహారానికి నిధులు మంజూరయ్యాయి. కొన్నిచోట్ల ఉపాధ్యాయులు కూడా సహకరిస్తున్నారు. జిల్లాలో 16,975మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానుండగా 98 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం.
సందేహాల నివృత్తి
పదో తరగతిలో వంద శాతం ఫలితాలు సాధించేలా ప్రభుత్వ పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులకు ఇప్పటికే సూచనలు చేశారు. కొద్దినెలల క్రితమే సిలబస్ పూర్తికాగా ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. ఆ తరగతుల్లో చదివిస్తూ ఉపాధ్యాయులు వారి సందేహాలను నివృత్తి చేస్తున్నారు. అంతేకాక తరచుగా మాక్ పరీక్షలు నిర్వహించి మార్కులు తక్కువగా వచ్చిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. దీంతో ఫలితాలు గతంతో పోలిస్తే కచ్చితంగా మెరుగుపడతాయనే ఆశాభావంతో ఉన్నాం. ఇటీవల విద్యార్థుల్లో పరీక్షలపై భయాన్ని తొలగించేలా మోటివేషనల్ స్పీకర్ గంపా నాగేశ్వరరావుతో అవగాహన కల్పించాం. ఈ సమావేశంలో కలెక్టర్ అనుదీప్ కూడా పాల్గొని విద్యార్థుల్లో భయాన్ని తొలగించేలా సూచనలు చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణత సాదించడమే లక్ష్యంగా హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం అనేక సౌకర్యాలు కల్పిస్తోంది. వీటిని సద్వినియోగం చేసుకుంటూ నూరుశాతం ఫలితాలు సాధించేలా క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. ఇదే సమయాన నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఉపాధ్యాయులకు చర్యలు తీసుకుంటున్నాం. ఇక కలెక్టర్ అనుదీప్ కూడా విద్యాశాఖపై ప్రత్యేక దష్టి సారించడం, పర్యవేక్షిస్తుండడంతో ఫలితాలు తప్పక మెరుగవుతాయనే నమ్మకం ఉంది.


