● ఇంటి వద్దే ఫిర్యాదు స్వీకరణ, ఎఫ్‌ఐఆర్ నమోదు ● జిల్లా పోలీసు శాఖ విన్నూత ప్రయోగం
ఖమ్మంక్రైం: వివిధ ఘటనల్లో నష్టపోయే వారు పోలీ సులను ఆశ్రయించడం, ఆపై ఎఫ్‌ఐఆర్ నమోదు, ఆతర్వాత కాపీ తీసుకోవడంలో ఇబ్బంది పడకుండా పోలీసు శాఖ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. బాధితుల్లో కొందరు ఫిర్యాదుకు ముందుకొస్తున్నా మరికొందరు ఆరోగ్య కారణాలు, ఇతర పరిస్థితులతో పోలీసుస్టేషన్ మెట్లు ఎక్కలేకపోతున్నారు. సమాజంలో పరువు పోతుందనే భయం ఇందుకు ప్రధాన కారణంగా నిలుస్తోంది. వీరు కాక వృద్ధులు, దివ్యాంగులు సైతం స్టేషన్‌కు వచ్చే పరిస్థితి ఉండడం లేదు. ఈనేపథ్యాన పోలీసులే వారి ఇంటికి వెళ్లి ఎఫ్‌ఐఆర్ కాపీ ఇచ్చే ప్రక్రియ మొదలుపెట్టారు.
హైదరాబాద్ తర్వాత...
ఇంటి వద్దే కేసు నమోదు, ఎఫ్‌ఆర్ జారీ విధానాన్ని తెలంగాణలో తొలుత రాష్ట్ర సీఐఈ విభాగం శ్రీకా రం చుట్టింది. మొదటిసారిగా ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్ నమోదును ప్రవేశపెట్టడంతో మంచి ఫలితాలు వచ్చాయని తెలుస్తోంది. దీంతో ఉన్నతాధికారుల సూచనలు, సీపీ సునీల్‌దత్ ఆదేశాలతోశుక్రవారం నుంచి జిల్లాలోనూ ఈ విధానం అమలుకు నిర్ణయించారు.
బాధితుల ఇంటికే...
ఖమ్మం మహిళా పోలీస్‌స్టేషన్ పరిధిలో వరకట్నం కోసం వేధిస్తున్న భర్త, అత్తామామలపై ఓ మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసు సిబ్బంది శుక్రవారం నేరుగా బాధితురాలి ఇంటికి వెళ్లి ఎఫ్‌ఐఆర్ కాపీ అందజేశారు. అలాగే, చింతకానికి చెందిన ఇట్టా అనితతో చుట్టుపక్కల వాళ్లు గొడవ పడి దాడి చేయడంతో గాయాలయ్యాయి. ఆమె పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నట్లు తెలుసుకున్న సిబ్బంది అనిత ఇంటికే వెళ్లి ఫిర్యాదు తీసుకుని ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
బాధ్యతాయుతంగా...
పోలీసుస్టేషన్‌కు రావటానికి వీల్లేని పరిస్థితుల్లో ఉన్న వారు నిరాశ పడాల్సిన పనిలేదని అధికారులు సూచిస్తున్నారు. ఘటనకు సంబంధించి సమాచా రం, ఇతర వివరాలను అక్కడి పోలీసుస్టేషన్‌కు తెలియచేస్తే సిబ్బందే నేరుగా ఇంటికి వచ్చి ఫిర్యాదు స్వీకరించి ఎఫ్‌ఐఆర్ జారీ చేస్తారని తెలిపారు. బాధితులకు అండగా నిలవడంలో భాగంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని వెల్లడించారు. మహిళలు, పిల్లలపై జరిగే నేరాలు, శారీరక దాడులు, ఆస్తి వివాదాల్లో ఒత్తిడి, పోక్సో, అట్రాసిటీ కేసులే కాక బాల్య వివాహాలు, ర్యాగింగ్ వంటి కేసుల్లో ఫోన్ ద్వారా సమాచారం ఇస్తేవిచారణ చేసి వారి ఇంటికే వెళ్లి ఎఫ్‌ఐఆర్ నమోదుచేస్తామని తెలిపారు.


