ఒకే బస్సులో 107 మంది
అరుపులు విని పరుగెత్తి వచ్చాం..
● మద్యం మత్తులో డ్రైవర్.. ఆపై నిర్లక్ష్యం ● కాలువలో బోల్తా పడిన పాఠశాల బస్సు ● 20 మంది చిన్నారులకు గాయాలు
వేంసూరు/పెనుబల్లి: పరిమితికి మించి విద్యార్థుల ను ఎక్కించడమే కాక.. డ్రైవర్ మద్యం మత్తులో ఉండగా పాఠశాల బస్సు సాగర్ కాలువలో బోల్తా పడింది. ఈ సమయాన నీళ్లు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పగా పలువురు చిన్నారులకు గాయాలయ్యాయి. కాసేపైతే ఇళ్లకు చేరతామన్న భావనతో ఉన్న చిన్నారులు ఈ ఘటనతో భీతిల్లిపోయారు. ఏం జరిగిందో తెలియక రక్తమోడుతున్న గాయాలతో విద్యార్థులు రోదనలతో ఆ ప్రాంతం మార్మోగింది. పెనుబల్లి, వేంసూరు మండలాల మధ్యలో జరిగిన ఈ ప్రమాదం వివరాలిలా ఉన్నాయి.
సామర్థ్యానికి మించి తీసుకెళ్తూ...
వేంసూరు మండలం మొద్దులగూడెం గ్రామంలో వివేకానంద పాఠశాల కొనసాగుతోంది. ఈ పాఠశాలలో మండలంలోని వివిధ గ్రామాలతో పాటు పెనుబల్లి మండలంలోని గ్రామాల విద్యార్థులు చదువుకుంటున్నారు. రోజులాగే శుక్రవారం పాఠశాల ముగిశాక పెనుబల్లి మండలం గణేషన్‌పాడు, ఎల్ ఎస్.బంజర్, ముత్తగూడెం, గుట్టపాడు తదితర గ్రామాల విద్యార్థులను దింపేందుకు బస్సులో తీసుకెళ్తున్నారు. అయితే, ఒకే బస్సులో 107మంది పిల్ల లను ఎక్కించగా... డ్రైవర్ ఆళ్ల నవీన్ మద్యం మత్తులో నిర్లక్ష్యంగా నడిపాడని తెలిసింది. ఆయన రెండు రోజులుగా మద్యం సేవించి వస్తున్నట్లు తెలిసినా పట్టించుకోలేదని సమాచారం. కాగా, బస్సు పెనుబల్లి మండలం గణేషన్‌పాడు శివారు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం సమీపానికి చేరేసరికి ఎన్నెస్పీ మేజర్ కాలువ వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. అయితే, కాలువలో నీళ్లు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పినా సామర్ధ్యానికి మించి పిల్లలు ఉండడంతో ఒకరిపై ఒకరు పడగా 20మందికి గాయాలయ్యాయి. బస్సు పడుతున్నప్పుడు పెద్ద శబ్దం రావడం, ఆ తర్వాత ఆందోళనతో విద్యార్థులు చేసిన రోదనలు, అరుపులతో స్థానికులు చేరుకుని బయటకు తీశారు. బస్సు బోల్తా పడగానే డ్రైవర్ నవీన్ కనీసం పట్టించుకోకుండా పరారవడం గమనార్హం. స్థానికులే పిల్లలను బయటకు తీసి అంబులెన్స్‌లు, ఆటోల ద్వారా 15 మంది తిరుపూరులో ప్రైవేట్ ఆస్పత్రికి, ఏడుగురిని పెనుబల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్‌యాదవ్, ఏసీపీ వసుంధర యాదవ్ చేరుకుని సహాయక చర్యలను పరిశీలించగా, ఎమ్మెల్యే మట్టా రాగమయి హుటాహుటీన చేరుకుని వివరాలు ఆరా తీశారు. అంతేకాక తిరుపూరులో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఆమె పరామర్శించారు. కాగా, గతంలోనూ ఇదే పాఠశాల బస్సు లచ్చన్నగూడెం, భరణిపాడు గ్రామాల్లో ప్రమాదానికి గురైందని స్థానికులు తెలిపారు.
బస్సు ప్రమాదంపై మంత్రుల ఆరా
గణేషన్‌పాడు వద్ద ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా పడిందన్న సమాచారంతో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి ఆరా తీశారు. జిల్లా కలెక్టర్ అనుదీప్‌తో పాటు రవాణా శాఖ అధికారులు, కల్లూరు ఏసీపీ, సబ్ కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని, అవసరమైతే జిల్లా ఆస్పత్రికి తరలించాలని ఆదేశించారు. అంతేకాక ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించాలని సూచించారు.
బస్సు కాల్వలో పడిన సమయాన పెద్దశబ్దం వచ్చింది. అంతేకాక విద్యార్థుల అరుపులు దగ్గరలోని పొలంలో పనిచేస్తున్న మాకు వినబడ్డాయి. నాతో పాటు మరికొందరం పరుగెత్తి వచ్చి బస్సులో నుంచి విద్యార్థులను బయటకు తీశాం. అందులో చాలామందికి గాయాలయ్యాయి. వీరిని ఆటోలు, అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.
– పెరవరపు నరసింహ, ప్రత్యక్ష సాక్షి
ఒకే బస్సులో 107 మంది
ఒకే బస్సులో 107 మంది


