● మరిపెడ మండలంలో ఘటన ● తిరుమలాయపాలెం మండలం బచ్చోడు వాసి
చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి
కారేపల్లి: భార్య కాపురానికి రాకపోవటంతో మనస్థాపం చెందిన వ్యక్తి పురుగుమందు తాగగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని మంగళితండాకు చెందిన ధరావత్ రాములు (32) మద్యం తాగుతున్నాడని భార్య సుజాత గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయింది. 6 నెలలు అయినా భార్య రాకపోవడంతో ఈ నెల 3వ తేదీన రాములు పురుగుమందు తాగగా కుటుంబ సభ్యులు ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుడి తల్లి రుక్కి ఫిర్యాదుతో కారేపల్లి ఎస్‌ఐ–2 కోడెత్రాసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
మరిపెడ రూరల్: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం బుర్హాన్‌పురం గ్రామ శివారు సూర్యాపేట – మహబూబాబాద్ జాతీయ రహదారిపై ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై వీరభద్రరావు కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా తిరుమలయపాలెం మండం బచ్చోడు గ్రామ శివారు బచ్చోడు తండాకు చెందిన ధరావత్ రవీందర్ (30) పని నిమిత్తం బైక్‌పై మరిపెడకు వచ్చాడు. తిరుగు ప్రయాణంలో బుర్హాన్‌పురం గ్రామ శివారు మలుపు వద్ద బైక్ అదుపు తప్పి సిగ్నల్ స్తంభాన్ని ఢీకొంది. ఈ ఘటనలో రవీందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
సంపులో పడి కళాకారుడు మృతి
సత్తుపల్లిరూరల్: ప్రమాదవశాత్తు సంపులో పడి కళాకారుడు మృతిచెందిన ఘటన మండలంలోని కాకర్లపల్లి లో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సోదర డ్యాన్స్ అకాడమీ నిర్వాహకుడు, రంగస్థల కళాకారుడు ఓలేటి వెంకటరమణ (50) ఇంటి ఆవరణలో నిల్చుండగా ఫిట్స్ రావడంతో పక్కనే ఉన్న నీటి సంపులో పడిపోయాడు. గమనించిన స్థానికులు సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వెంకటరమణ మృతికి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్, మాజీ ఎంపీపీ చల్లారి వెంకటేశ్వరరావు, తమ్మిశెట్టి గణేశ్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.


