మరో సమరం ! | - | Sakshi
Sakshi News home page

మరో సమరం !

Jan 3 2026 6:53 AM | Updated on Jan 3 2026 6:53 AM

మరో స

మరో సమరం !

గతంలో మూడు.. ఇప్పుడు ఐదు

ఓటర్ల జాబితా తయారీపై అధికారుల కసరత్తు జోరు కొనసాగించేలా కాంగ్రెస్‌.. పట్టు నిలుపుకునేలా బీఆర్‌ఎస్‌ పావులు సన్నాహాల్లో కమ్యూనిస్టులు, రేసులో బీజేపీ కూడా...

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: మరో ఎన్నికల సమరానికి రాజకీయ పార్టీలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇటీవలే గ్రామపంచాయతీ ఎన్నికలు ముగియగా.. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు వచ్చే నెలలో ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే అధికారులు ఓటర్ల జాబితా రూపకల్పనలో నిమగ్నం కావడంతో ఆశావహులు పోటీకి సిద్ధమవుతుండగా, పార్టీలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులు అధిక స్థానాల్లో నెగ్గిన నేపథ్యాన మున్సిపల్‌ ఎన్నికల్లోనూ అదే జోరు కొనసాగించేందుకు పార్టీ కసరత్తు చేస్తోంది. ఇక గత మున్సిపల్‌ ఎన్నికల మాదిరి పట్టు నిలుపుకునేందుకు బీఆర్‌ఎస్‌, పూర్వ వైభవాన్ని సాధించేందుకు కమ్యూనిస్టులు.. ఉనికి చాటుకునేందుకు బీజేపీ ఈ ఎన్నికలను ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాయి.

అదే ఒరవడి సాగేలా..

అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ తిరుగులేని శక్తిగా ఎదిగింది. జిల్లాలోని ఐదు అసెంబ్లీ స్థానాలే కాక పార్లమెంట్‌ స్థానాన్ని దక్కించుకుంది. ఇటీవల గ్రామపంచాయతీ ఎన్నికల్లోనూ జిల్లాలో అత్యధిక స్థానాలను ఆ పార్టీ మద్దతుదారులే గెలుచుకున్నారు. ఈ ఎన్నికలు పార్టీల రహితంగా జరిగినా పార్టీల ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఇక పార్టీ గుర్తులతో జరిగే మున్సిపల్‌ ఎన్నికల్లోనూ పార్టీ వైభవం చాటాలని కాంగ్రెస్‌ నాయకత్వం సిద్ధమవుతోంది. స్థానికంగా ఎవరికి బలం ఉంది, ఎవరికి టికెట్‌ ఇస్తే విజయం దక్కుతుందన్న అంశంపై అంతర్గతంగా ఆరా తీస్తున్నట్లు సమాచారం.

క్లీన్‌స్వీప్‌ మళ్లీ సాధ్యమా?

సత్తుపల్లి, మధిర, వైరా మున్సిపాలిటీలకు 2020లో జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ క్లీన్‌స్వీప్‌ సాధించింది. సత్తుపల్లిలోని 23 వార్డులకు అన్నిచోట్ల ఆ పార్టీ అభ్యర్థులే గెలిచారు. మధిరలో 22 వార్డులకు 13, వైరాలో 20 వార్డులకు 16 వార్డుల్లో బీఆర్‌ఎస్‌ గెలిచింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్‌ అధికారంలో ఉండడం, పంచాయతీ ఎన్నికల్లోనూ ఆ పార్టీ ఆధిక్యత ప్రదర్శించిన నేపథ్యాన పాత, కొత్త మున్సిపాలిటీల్లో ఎలా సత్తా చాటాలన్న అంశంపై బీఆర్‌ఎస్‌ నాయకత్వం కసరత్తు చేస్తోంది.

కమ్యూనిస్టులకు కలిసి వచ్చేనా?

పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకున్న సీపీఎం కొంత ప్రభావాన్ని చూపింది. ఇక మున్సిపల్‌ ఎన్నికల్లోనూ పొత్తుపై ఉభయ కమ్యూనిస్టులు పెదవి కదపడం లేదు. పట్టు ఉన్న ప్రాంతాల్లో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలోనే పార్టీలు ఉన్నందున మున్సిపల్‌ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతల్లో చర్చలు సాగుతున్నాయి. మరోవైపు జీపీ ఎన్నికల్లో మాదిరే బీఆర్‌ఎస్‌, సీపీఎం పొత్తు కొనసాగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మోదీ చరిష్మాతో..

మున్సిపల్‌ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై బీజేపీ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. మోదీ చరిష్మాతో ఈ ఎన్నికల్లో సత్తా చాటాలనే ప్రయత్నాలు చేస్తోంది. కేంద్రప్రభుత్వం నుంచి వచ్చే నిధులతోనే మున్సిపాలిటీల్లో అభివృద్ధి జరుగుతోందనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యకర్తలను సమాయత్తం చేస్తోంది. క్షేత్రస్థాయిలో బలం పుంజుకోవడానికి మున్సిపల్‌ ఎన్నికలను ఉపయోగించుకోవాలనే భావనలో ఉన్నట్లు సమాచారం.

గతంలో జిల్లాలో సత్తుపల్లి, మధిర, వైరా మున్సిపాలిటీలు ఉండేవి. ఇటీవల ఏదులాపురం, కల్లూరు మున్సిపాలిటీలు కొత్తగా ఏర్పడ్డాయి. 2020 జనవరిలో పాత మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించగా అన్నింటా బీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. ఈ పాలకవర్గాల గడువు గత ఏడాది జనవరి 26తో ముగియడంతో ఎన్నికలు నిర్వహించాలనే భావనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించగా ఈనెల చివరి వారంలో షెడ్యూల్‌ విడుదలవుతుందన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేయడంతో అభ్యంతరాల పరిష్కారం, మార్పులు, చేర్పుల అనంతరం 10లోగా తుది ఓటర్ల జాబితా విడుదల చేయాల్సి ఉంటుంది.

వచ్చే నెలలో మున్సి‘పోల్స్‌’ నిర్వహణ?

మరో సమరం !1
1/1

మరో సమరం !

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement