●హాహాకారాలు.. ఆర్తనాదాలు
అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట శివారు ఎర్రమ్మగుడి సమీపంలో మణుగూరు–కొత్తగూడెం ప్రధాన రహదారి వెంట వంతెన వద్ద పాల్వంచకు చెందిన కేఎల్‌ఆర్ కళాశాల బస్సు బోల్తాపడింది. పినపాక, మణుగూరు, అశ్వాపురం మండలాల విద్యార్థులతో మణుగూరు నుంచి బయలుదేరిన బస్సు మొండికుంట దాటాక అటవీ ప్రాంతంలో స్టీరింగ్ సక్రమంగా పనిచేయక అదుపు తప్పి వాగు, వంతెన పక్కకు బోల్తా పడినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 50 మంది విద్యార్థులు ఉండగా, 40 మందికిపైగా గాయాలయ్యాయి. ఇందులో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా ఇద్దరికి చేతులు విరిగాయి. సీఐ అశోక్‌రెడ్డి, ఎస్సై రాజేష్ సిబ్బందితో చేరుకుని స్థానికుల సాయంతో క్షతగాత్రులను 108 వాహనాల్లో భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా, విద్యార్థులంతా డిప్లొమా, బీటెక్ కోర్సులు చదువుతున్నారు. అయితే, మణుగూరు–కొత్తగూడెం ప్రధాన రహదారిపై ఎర్రమ్మగుడి సమీపంలో వంతెన వద్ద బస్సు బోల్తా పడింది. రెప్పపాటు తప్పినా బస్సు వాగులో బోల్తాపడేది. బస్సువాగులో బోల్తా పడితే పెద్ద ప్రమాదం జరిగి ప్రాణాపాయం ఉండేది. వాగును చూసిన స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు. కాగా, బస్ ఫిట్‌నెస్ లేకపోవడమే ప్రమాదానికి కారణమని విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానికులు భావిస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం కూడా ఉందని ఆరోపిస్తున్నారు. మరమ్మతులకు గురైన బస్సు కావడంతో స్టీరింగ్ స్టక్ అయి ప్రమాదం జరిగినట్టు సమాచారం. విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు డ్రైవర్‌పై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ రాజేష్ తెలిపారు. ప్రమాదం జరిగిందని తెలిసి అక్కడకు చేరుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు రక్తమోడుతున్న తమ పిల్లలను చూసి కన్నీరుమున్నీరయ్యారు.


