ప్రతీ రైతుకు యూరియా అందిస్తాం..
● అవసరానికి మించి మాత్రం కొనుగోలు చేయొద్దు ● కలెక్టర్ అనుదీప్, సీపీ సునీల్‌దత్
కొణిజర్ల: పంటలు సాగుకు అనుగుణంగా రైతులందరికీ యూరియా అందేలా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టిందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కొణిజర్లలోని గోపవరం వ్యవసాయ సహకార పరపతి సంఘంలో యూరియా పంపిణీని పోలీసు కమిషనర్ సునీల్‌దత్‌తో కలిసి శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యూరియా విషయంలో రైతులు అపోహలు వీడాలని సూచించారు. జిల్లాలో 13,180 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉన్నందున అందరికీ సరఫరా చేస్తామని తెలిపారు. మొక్కజొన్న ఎక్కువగా సాగు చేస్తున్న కొణిజర్ల, చింతకాని, బోనకల్, ముదిగొండ మండలాల్లో ప్రతీ రెండు వేల ఎకరాలకు ఒక సేల్ పాయింట్ ద్వారా పంపిణీ చేపడతామని చెప్పారు. కొణిజర్ల మండలంలో ఇప్పటికే ఉన్న ఏడు సేల్ పాయింట్లకు తోడు మరో తొమ్మిది కేంద్రాలు ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. అంతేకాక యూరియా కోసం రైతులు ఎప్పుడు రావాలో ముందస్తు సమాచారం ఇస్తామని వెల్లడించారు. అయితే, రైతు తన సాగు విస్తీర్ణానికి కావాల్సిన యూరియా కంటే ఎక్కువ తీసుకెళ్లొద్దని, ఈ విషయంలో ఉద్యోగులు పర్యవేక్షించాలని సూచించారు. జిల్లా వ్యవసాయ శాఖాధికారి డి.పుల్లయ్య, డ్రెయినీ డిప్యూటీ కలెక్టర్ ఎం.అపూర్వ, ఏడీఏ కరుణశ్రీ, తహసీల్దార్ అరుణ, ఏఓ బాలాజీ తదితరులు పాల్గొన్నారు,


