ఓటర్ల జాబితా రెడీ
ముసాయిదా విడుదల చేసిన
అధికారులు
అభ్యంతరాల పరిష్కారం తర్వాత 10న తుది జాబితా
మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో
కీలక అడుగు
మధిర: మధిర మున్సిపాలిటీలో ఓటర్ల ముసాయిదా ఓటర్ల జాబితాను కమిషనర్ సంపత్‌కుమార్ విడుదల చేసి వివరాలు వెల్లడించారు. ఈ జాబితాపై అభ్యంతరాలు, సూచనలు స్వీకరించనుండగా, మార్పులు, చేర్పుల కోసం గడువులోగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. మధిర మున్సిపల్‌లో 22 వార్డులకు గాను ముసాయిదా ప్రకారం 25,679 మంది ఓటర్లు ఉన్నట్లు తేలింది. వీరిలో 13,424 మంది మహిళలు, 12,251 మంది పురుషులతో పాటు ఇతరులు నలుగురు ఉన్నారని కమిషనర్ తెలిపారు.
సత్తుపల్లిటౌన్: సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధి 23 వార్డులకు గాను ఓటర్ల జాబితా సిద్ధమైంది. ముసాయిదా జాబితాను మున్సిపల్ కమిషనర్ కొండ్రు నర్సింహ విడుదల చేయగా, 28,479 మంది ఓట ర్లు ఉన్నారని వెల్లడించారు. ఇందులో 13,465 మంది పురుషులు, 14,999 మంది మహిళా ఓటర్లతో పాటు 15 మంది ఇతరులు ఉన్నారని వెల్లడించారు.
వైరా: రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వైరా మున్సిపాలిటీ పరిధి 20 వార్డులకు సంబంధించి ఓటర్ల ముసాయిదాను కమిషనర్ యూ.గురులింగం విడుదల చేశారు. ఈ జాబితాపై అభ్యంతరాలు ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అనంతరం విచారణ చేపట్టడంతో రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించాక తుది జాబితా విడుదల చేస్తామని పేర్కొన్నారు.
ఖమ్మంరూరల్: ఏదులాపురం మున్సిపాలిటీలో ఓటర్ల ముసాయిదాను కయమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి విడుదల చేసి మాట్లాడారు. మున్సిపల్ పరిధిలో 32 వార్డులకు గాను 45,256 ఓటర్లు ఉన్నారని తెలిపారు. జాబితాను పరిశీలించి అభ్యంతరాలు ఉంటే మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు అందించాలని సూచించారు. కాగా, ఈనెల 5న రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
కల్లూరు రూరల్ : కల్లూరు మున్సిపాలిటీ ఓటర్ల జాబితా ముసాయిదాను కమిషనర్ ఎం.రామచంద్రరావు గురువారం విడుదల చేశారు. ఈ జాబితా ఆధారంగా మహిళా ఓటర్లు 9,785 మంది, పురుషులు 9,081 కలిపి మొత్తం 18,866 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. కాగా, మున్సిపల్ పరిధిలో వార్డుల విభజన, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఓటర్ల జాబితా ముసాయిదా తయారీని కల్లూరు సబ్‌కలెక్టర్ అజయ్‌యాదవ్ గురువారం పరిశీలించారు. మున్సిపల్‌లో 20 వార్డులకు గాను 13 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయనున్నట్లు ఉద్యోగులు తెలిపారు.
మున్సిపాలిటీ ఎన్నికలు ఫిబ్రవరిలో జరుగుతాయని ప్రచారం జరుగుతుండగా రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈమేరకు జిల్లాలోని మున్సిపాలిటీల్లో గురువారం ఓటర్ల ముసాయిదా జాబితాలు విడుదల చేశారు. మధిర,
సత్తుపల్లి, వైరా పాత మున్సిపాలిటీలతో పాటు కొత్తగా ఏర్పడిన ఏదులాపురం, కల్లూరు మున్సిపాలిటీలకు సంబంధించి కూడా ముసాయిదా సిద్ధం చేశారు. ఈనెల 5వ తేదీన రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించడమే కాక ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆపై అభ్యంతరాలను పరిశీలించి పరిష్కరించాక 10వ తేదీన తుది ఓటర్ల జాబితా విడుదల చేయనున్నారు. కాగా, ముసాయిదా ఆధారంగా జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లోనూ మహిళా ఓటర్లే ఎక్కువగా ఉండడం విశేషం.


