పెద్దమ్మను హత్య చేసిన రౌడీషీటర్
ఖమ్మంక్రైం: భూతగాదాల్లో సొంత పెద్దమ్మను ఓ రౌడీషీటర్ నడిరోడ్డుపై హతమార్చాడు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని బొక్కలగడ్డలో గురువారం ఈ ఘటన చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం నాతాళ్లగూడెంనకు చెందిన మోటె రాములమ్మ(70) కుటుంబం బతుకుదెరువు కోసం ఏళ్ల క్రితం ఖమ్మం వచ్చి బొక్కలగడ్డలో నివాసం ఉంటోంది. ఆమె భర్త యాదగిరి మృతి చెందాక కూలీ పనులు చేసుకుంటూ కుమారుడు నర్సింహారావుతో జీవిస్తోంది. ఆమె భర్త, ఆయన సోదరులకు సంబంధించి స్వగ్రామంలో ఐదెకరాల పొలం ఉండగా ఇంకా పంచుకోలేదు. ఆ భూమిని రాములమ్మ గ్రామంలో ఉంటున్న కుమార్తె పేరిట రిజిస్టర్ చేశాక గొడవలు మొదలయ్యాయి. పెద్దమనుషులు బుధవారం మాట్లాడి సమస్య పరిష్కారం అయ్యేవరకు పొలాన్ని దున్నవద్దని చెప్పారు. అయినా రాములమ్మ కుమార్తె దున్నిస్తోందనే సమాచారంతో ఖమ్మం వెంకటేశ్వరనగర్‌లో జీవిస్తున్న రాములమ్మ మరిది కుమారుడు మోటె శేఖర్ పెద్దమ్మ ఇంటికి రాగా, ఆ సమయంలో ఆమె కుమారుడు పనికి వెళ్లాడు. ఈక్రమాన వాదన పెరగడంతో ఆరుబయట మిర్చి తొడిమలు తీస్తున్న రాములమ్మ ఊపిరితిత్తులపై శేఖర్ కత్తితో పొడవడంతో సమీపంలోని మహేష్ అనే వ్యక్తి రాగా ఆయనపైనా దాడి చేశాడు. ఘటనలో తీవ్రగాయాలతో రాములమ్మ అక్కడికక్కడే మృతి చెందగా శేఖర్ పారిపోయాడు. కాగా, జులాయిగా తిరిగే శేఖర్‌పై ఖమ్మం త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీట్‌తో పాటు పలు కేసులు నమోదయ్యాయి. సమాచారం అందుకున్న సీఐ మోహన్‌బాబు, ఎస్‌ఐ కొండలు చేరుకుని రాములమ్మ మృతదేహన్ని అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సహకారంతో మార్చురీకి తరలించారు. మృతురాలి కుమారుడు నర్సింహారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయగా,నిందితుడు శేఖర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
భూమి పంపకంలో తగాదాలే కారణం


