3.26 కోట్ల చేపపిల్లలు
చేపల పెంపకానికి అనువుగా...
● జిల్లాలోని 820 జలాశయాల్లో వదిలిన అధికారులు ● చేపపిల్లల విలువ రూ.4.50కోట్లు
ఖమ్మంవ్యవసాయం: మత్స్యకారుల ఉపాధి మెరుగుపరిచేలా రూపొందించిన ఉచిత చేపపిల్లల పంపిణీ పథకం జిల్లాలో ఎట్టకేలకు లక్ష్యాన్ని చేరింది. ఈ ఏడాది సీజన్ ఆరంభం నుంచి కురిసిన వర్షాలతో జిల్లాలోని జలాశయాల్లోకి సమృద్ధి నీరు చేరింది. దీనికి తోడు జిల్లాకు ప్రధాన నీటి వనరుగా ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిండడం, అక్కడి నుంచి నీటి విడుదలతో జలాశయాలు కళకళలాడుతున్నాయి. ఈమేరకు జిల్లాలోని 882 జలాశయాల్లో 3.48 కోట్ల చేప పిల్లలను విడుదల చేయాలని మత్స్యశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అయితే, ఉచిత చేప పిల్లల పంపిణీ టెండర్లకు తొలుత కాంట్రాక్టర్లు ముందుకు రాక జాప్యం జరిగింది. చివరకు ప్రభుత్వం చర్చలు జరపడంతో సెప్టెంబర్ చివరి వారంలో టెండర్లలో పాల్గొన్నారు. కాగా, కోర్టు కేసుల కారనంగా 42 జలాశయాలు మినహా మిగతా వాటిలో చేపపిల్లల విడుదల పూర్తిచేశారు.
సైజ్‌ల వారీగా..
జిల్లాలోని 820 జలాశయాల్లో సుమారు రూ.4.50 కోట్ల విలువైన 3.26 కోట్ల చేపపిల్లలను విడుదల చేశారు. నీటి సామర్ద్యం, ఇతర వనరుల ఆధారంగా రెండు రకాల సైజ్‌ల్లో చేపపిల్లలను వదిలారు. 80–100 మి.మీ.ల బొచ్చు, రవ్వు, బంగారు తీగ పిల్లలు 2.20 కోట్లు ఉండగా, 35–40 మి.మీ.ల సైజ్‌లో బొచ్చ, రవ్వ, మోసు రకాలు 1.06 కోట్ల పిల్లలను జలాశయాల్లో విడుదల చేశారు.
16,500 మంది మత్స్యకారులకు ఉపాధి
జలాశయాల్లో వంద శాతం సబ్సిడీపై చేపపిల్లలు విడుదల చేయడంతో మత్స్యకారుల ఉపాధికి దోహదపడుతుంది. జిల్లాలోని 210 మత్స్య సహకార సంఘాల్లో 16,500 మంది సభ్యులు ఉన్నారు. ప్రభుత్వం జలాశయాల్లో చేప పిల్లలను విడుదల చేయించాక సంరక్షణ బాధ్యతను సహకార సంఘాలకు అప్పగిస్తారు. సభ్యుల చేప పిల్లలను సంరక్షిస్తూ ఏటా వేసవిలో మూడు నెలల పాటు చేపలు వేటాడి అమ్మమడం ద్వారా ఉపాధి పొందుతారు. జిల్లాలోని జలాశయాల నుంచి ఏటా సుమారు 25 వేల టన్నుల చేపల ఉత్పత్తి జరుగుతుందని అంచనా.
జిల్లాలోని జలాశయాల్లో నీరు సమృద్ధిగా ఉండడం చేపల పెంపకానికి కలిసి వస్తోంది. సాగర్ ప్రాజెక్టు నుంచి విడుదలైన నీరు జలాశయాల్లోకి చేరడంతో చేపపిల్లల ఎదుగుదలకు ఎలాంటి ఆటంకాలు రావు. ఈ ఏడాది లక్ష్యం మేర చేప పిల్లలను వదిలాం. తద్వారా మత్స్యకార కుటుంబాలకు ఉపాధి లభించనుంది.
– శివప్రసాద్, జిల్లా మత్స్య శాఖ అధికారి
3.26 కోట్ల చేపపిల్లలు


