పింఛన్ ఆగిపోతుంది.. జాగ్రత్త
సకాలంలో అందజేయండి
● లైఫ్ సర్టిఫికెట్లు ఇవ్వకపోతే ఇక్కట్లు ● సంస్థలో ఇంకా 15,888 మంది పెండింగ్
రుద్రంపూర్: సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు అందజేయాలని అధికారులు సూచిస్తున్నారు. లేనిపక్షంలో పింఛన్ ఆగిపోయే అవకాశం ఉన్నందున జాగ్రత్త పడాలని చెబుతున్నారు. సంస్థ వ్యాప్తంగా సీఎంపీఎఫ్ పెన్షనర్లు, సీపీఆర్‌ఎంఎస్(పోస్ట్ రిటైర్‌మెంట్ కార్పొరేట్ మెడికల్ స్కీమ్) కార్డుదారులు రెన్యువల్ కోసం డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంది. తద్వారా ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు పింఛన్ క్రమం తప్పకుండా అందుతుంది. పింఛన్‌దారుడు బతికే ఉన్నట్లు నిర్ధారించేందుకు ఈ సర్టిఫికెట్ అవసరం కాగా, ఒకవేళ వారు మృతి చెందితే వారి నామినీకి పింఛన్ అందించనున్నారు. అలాగే, సీపీఎంఆర్‌ఎస్ ద్వారా వైద్యసేవలు పొందేందుకు లైఫ్ సర్టిఫికెట్ అవసరమవుతుంది.
ఇచ్చింది 72,212 మంది
సింగరేణి వ్యాప్తంగా 88,100 మంది పెన్షన్‌దారులు ఉండగా అందులో 72,212 మందే డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించారు. ఇంకా 15,188 మంది అందజేయాల్సి ఉంది. అలాగే, సీపీఆర్‌ఎంఎస్‌లో 81,595 మందికి 14,693 మంది ఇవ్వాల్సి ఉంది. ఇందులో రూ.300 మొదలు రూ.20 వేల వరకు పెన్షన్ పొందే కార్మికులు ఉన్నారు. కాగా, ప్రకటనలతో సరిపెట్టకుండా ఏరియా వారీ జాబితా రూపొందించి లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించేలా అధికారులు చొరవ చూపాలని పలువురు కోరుతున్నారు. కాగా, సింగరేణి కార్మికులు పింఛన్‌తో పాటు వైద్యసౌకర్యం కోసం లైఫ్ సర్టిఫికెట్ ఆన్‌లైన్‌లోనూ సమర్పించే అవకాశమున్నందున సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
రిటైర్డ్ ఉద్యోగుల కోసం నెల పాటు గడువు ఇచ్చాం. అయినా 15వేల మందికి పైగా లైఫ్ సర్టిఫికెట్లను ఇప్పటివరకు సమర్పించలేదు. ఇకనైనా ఫోన్‌లో యాప్ ద్వారా లేదా మీ సేవ కేంద్రాల ద్వారా సర్టిఫికెట్లు అందజేయాలి.
– కిరణ్‌కుమార్, జీఎం (పర్సనల్)
పింఛన్ ఆగిపోతుంది.. జాగ్రత్త


