ప్రజలందరికీ మంచి జరగాలి
ఖమ్మంమయూరిసెంటర్/ఖమ్మం అర్బన్: ఉమ్మడి జిల్లా ప్రజలకు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం ద్వారా అర్హులందరికీ సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందేలా పాలన సాగిస్తామని వారు వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. అలాగే, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు వేర్వేరు ప్రకటనల్లో ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ఓటరు జాబితా
రూపకల్పనపై ఆరా
ఖమ్మంరూరల్: రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మున్సిపాలిటీల వారీగా ఓటర్ల జాబితా రూపకల్పన మొదలుపెట్టారు. ఈమేరకు ఏదులాపురం మున్సిపాలిటీలో పోలింగ్ స్టేషన్లు, వార్డుల వారీగా ఓటర్ల జాబితా సిద్ధం చేస్తుండగా అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె వివరాలు ఆరా తీయడంతో పాటు ఎక్కడా తప్పులు దొర్లకుండా జాబితా రూపొందించాలని సూచించారు. ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, ఉద్యోగులు పాల్గొన్నారు.
జిల్లాలో కుష్ఠువ్యాధి
సర్వే పూర్తి
ఖమ్మం వైద్యవిభాగం: కుష్ఠు వ్యాధి బాధితుల గుర్తింపునకు జిల్లాలో చేపట్టిన సర్వే పూర్తయిందని డీఎంహెచ్‌ఓ డి.రామారావు తెలిపారు. ప్రత్యేక బృందాల ద్వారా ఈనెల 18 నుంచి 31 వరకు జిల్లాలోని 2,55,363 ఇళ్లలో 9,44,943 మందికి పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఈమేరకు 1,369 మంది అనుమానితులను గుర్తించినట్లు తెలిపారు. వీరికి వైద్యపరీక్షలు నిర్వహించాక ఐదు కొత్త కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. వీరికి ఉచిత మల్టీ డ్రగ్ థెరపీ చికిత్స ప్రారంభించనున్నట్లు డీఎంహెచ్‌ఓ తెలిపారు. కాగా, చర్మంపై స్పర్శ లేకుండా వుండే లేతరంగు మచ్చలు కనిపిస్తే ప్రభుత్వ ఆస్పత్రి లేదా ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని డీఎంహెచ్‌ఓ సూచించారు.
విద్యుత్ ఉద్యోగులకు ర్యాంకులు
ఖమ్మంవ్యవసాయం: ఎన్పీడీసీఎల్ పరిధిలో ప్రతీనెల మాదిరిగానే నవంబర్‌లో ఉత్తమ సేవలందించిన అధికారులకు ర్యాంకులు ప్రకటించింది. డిస్కం స్థాయి అర్బన్ విభాగంలో ఖమ్మం టౌన్–1 ఏడీఈ సీహెచ్.నాగార్జున, టౌన్–5 ఏఈ తిరుపయ్య, రూరల్ విభాగంలో రాయుడుపాలెం ఏఈ అనిల్‌కుమార్ ర్యాంకులు సాధించారు. అలాగే, సర్కిల్ పరిధిలో సత్తుపలి డీఈ ఎల్.రాములు, ఏడీఈల స్థాయిలో ఖమ్మం టౌన్–2 ఏడీఈ యాదగిరి, పెనుబల్లి ఏడీఈ ఎస్.రామారావు, ఏఈల విభాగంలో ఖమ్మం టౌన్–2 ఏఈ రవికుమార్, చిన్నకోరుకొండి ఏఈ అబ్దుల్ ఆసీఫ్‌లు ర్యాంకులు దక్కించుకోగా పలువురు అభినందించారు.
ప్రజలందరికీ మంచి జరగాలి


