పేదల సంక్షేమమే పరమావధి
● రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ● రూ.15 కోట్ల విలువైన రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన
కల్లూరురూరల్: పేదల సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలుచేస్తోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కల్లూరు మండలంలోని వివిధ గ్రామాల్లో రూ.15 కోట్ల వ్యయంతో నిర్మించే బీటీ రోడ్ల పనులకు బుధవారం ఆయన కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయితో కలిసి శంకుస్థాపన చేశారు. పేరువంచలో జరిగిన సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ బీఆర్‌ఎస్ పాలనలో పేదలకు ఇల్లు ఇవ్వకపోగా, తాము అధికారంలోకి రాగానే రాష్ట్రంలో 4.50 లక్షల మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. రాబోయే మూడేళ్లలో అర్హులైన ఇందిరమ్మ గృహాలు మంజూరు చేస్తామని ప్రకటించారు.
పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత
పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. కల్లూరులో రూ.13 లక్షలతో నిర్మించిన అటవీశాఖ వనసంరక్షణ సమితి కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడారు. పులిగుండాలను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతున్న నేపథ్యాన అడవిని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కలెక్టర్ అనుదీప్, డీఎఫ్‌ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ మాట్లాడగా బ్యాటరీ వాహనాలను మంత్రి ప్రారంభించారు.
పాఠశాలలో తనిఖీ
కల్లూరు మండలంలోని పేరువంచ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంత్రి శ్రీనివాసరెడ్డి తనిఖీ చేశారు. కలెక్టర్ అనుదీప్, ఎమ్మెల్యే రాగమయి దయానంద్, సబ్ కలెక్టర్ అజయ్‌యాదవ్‌తో కలిసి హైస్కూల్‌ను పరిశీలించిన ఆయన విద్యార్థుల సంఖ్య తగ్గడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రహరీ నిర్మాణాన్ని రెండు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ వెంకటరెడ్డి, ఈఈ రామకోటి నాయక్, తహసీల్దార్ సాంబశివుడు, ఎంపీడీఓ చంద్రశేఖర్, ఎఫ్‌డీఓ మంజుల, ఎఫ్‌ఆర్‌ఓ ఉమ, డీఆర్‌ఓలు బానోతు రాంసింగ్, బానోతు శ్రీను, సురేష్, మార్కెట్ చైర్మన్ బాగం నీరజాదేవి, ప్రజాప్రతినిధులు, నాయకులు కీసర నిర్మల, అంకిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, చందర్‌రావు, కె.మోహన్‌రెడ్డి, కృష్ణవేణి, గోపాలరావు, మురళి పాల్గొన్నారు.


