నవోదయం కోసం..
పంటలు పండాలని రైతులు.. ప్రయోజనాలపై ఉద్యోగుల ఆశలు సంక్షేమ పథకాలకు ప్రజల ఎదురుచూపులు కొత్త సంవత్సరానికి జిల్లా వాసుల స్వాగతం
జిల్లాలో మరింత అభివృద్ధి
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: కొత్త ఆశలు, ఆలోచనలు, ఆకాంక్షలతో నూతన ఏడాదికి జిల్లా ప్రజానీకం స్వాగతం పలికింది. ఎవరికి వారు కొత్త సంవత్సరం తమకు కలిసి రావాలని మనసారా కోరుకున్నారు. వచ్చే మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో తమదే పైచేయి కావాలని పార్టీల నేతలు, వానాకాలం పంట నష్టాన్ని చవిచూసిన రైతులు రబీ, వచ్చే వానాకాలంలో సమృద్ధిగా దిగుబడులు రావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వపరంగా ప్రయోజనాలు సమకూరాలని ఉద్యోగులు, సంక్షేమ పథకాలతో లబ్ధి చేకూరాలని ప్రజలు కోరుతూ కొత్త సంవత్సరాన్ని ఘనంగా స్వాగతించారు.
సంతోషాలను వెతుకుతూ..
గత కాలపు గాయాలను మరిచిపోతూ, భవిష్యత్ వెలుగులను ఆశిస్తూ జిల్లా ప్రజలు నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టారు. జిల్లావ్యాప్తంగా బుధవారం సాయంత్రం నుంచే సంబురాలు మొదలుకాగా, అర్ధరాత్రి 12 గంటలు కాగానే ఇళ్ల నుంచి బయటకు వచ్చి కేరింతలు కొడుతూ కొత్త సంవత్సరాన్ని స్వాగతించారు. జిల్లా కేంద్రంలోని పలుచోట్ల ఈవెంట్లు ఏర్పాటుచేయగా సాంస్కృతిక కార్యక్రమాలతో హోరెత్తింది. ఇక కేక్‌లు, స్వీట్ల కోసం వచ్చిన వారితో బేకరీలు, రెస్టారెంట్లు అర్ధరాత్రి వరకు కళకళలాడాయి. మద్యం మత్తులో వెళ్లే వారి కారణంగా ప్రమాదాలు జరగకుండా పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
సరికొత్త వ్యూహాలు
గడిచిన ఏడాది చివరలో గ్రామపంచాయతీ ఎన్నికలు జరగగా, కొత్త ఏడాది ప్రథమార్థంలో మున్సిపల్ ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యాన రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది పదవీయోగం దక్కాలన్న ఆకాంక్షతో ఇప్పటికే వ్యూహాలు సిద్ధం చేసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పైచేయి సాధించడమే కాక, ఆ తర్వాత పరిషత్ ఎన్నికల్లోనూ విజయదుందుభి మోగించాలని రాజకీయ పార్టీలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈనేపథ్యాన ఎన్నికల్లో పోటీకి సై అంటున్న ఆశావహులు తమ జాతకం మారిపోవాలన్న ఆశతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారు.
బంగారు పంటలు పండాలని..
రైతులు గత ఏడాది తుపాన్లు, పంటలకు తెగుళ్లతో ఇబ్బంది ఎదుర్కొన్నారు. ధాన్యంతో పాటు పత్తి, మిర్చి సాగు చేసిన రైతులు అమ్ముకోవడానికి అవస్థ పడ్డారు. నూతన సంవత్సరంలో పంటలు బాగా పండడంతో పాటు గిట్టుబాటు ధర లభించాలని ఆశిస్తున్నారు. యూరియా కొరత తీరాలని, యాసంగితో పాటు వానాకాలంలోనూ మంచి దిగుబడులు రావాలనే ఆశతో కొత్త సంవత్సరాన్ని స్వాగతించారు.
‘ప్రయోజనాలు’ దక్కుతాయని..
సంక్షేమ పథకాలపై ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు. ఇప్పటికే పథకాలు అమలవుతున్నా ఇంకొన్ని అందాల్సి ఉంది. ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్‌తో పాటు అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు దక్కాలని ఆశిస్తున్నారు. సంక్రాంతికి రైతుభరోసా నిధులు విడుదల చేయనుండడంతో రైతుల్లో సంతోషం నిండనుంది. ఇవికాక ఆరు గ్యారంటీల్లో మిగిలినవి కూడా ఈ ఏడాది అమలవుతాయని ఎదురు చూస్తున్నారు. ఇక ఉద్యోగులు పీఆర్‌సీ, పెండింగ్ డీఏలు విడుదల కావాలని, ఉద్యోగ విరమణ చేసిన వారికి బకాయిలు వస్తాయని ఆశిస్తున్నారు.
పదవుల కోసం నాయకుల నిరీక్షణ
ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరాలి. అనుకున్న లక్ష్యాలను చేరడంతో పాటు సుఖసంతోషాలతో గడపాలి. జిల్లా మరింత ప్రగతిపథంలో పయనించేలా, అర్హులకు సంక్షేమ ఫలాలు అందేలా అందరం కలిసికట్టుగా కృషి చేస్తాం.
– అనుదీప్ దురిశెట్టి, కలెక్టర్


