ముగిసిన బాల్‌బ్యాడ్మింటన్ టోర్నీ
ఖమ్మంస్పోర్ట్స్: పులి రామస్వామి స్మారక ఇన్విటేషన్ రెండు రాష్ట్రాలస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ఆదివారం రాత్రి ముగిశాయి. మొదటిస్థానంలో ఈస్ట్‌కోస్ట్ రైల్వేస్ విశాఖపట్నం, ఒంగోలు ద్వితీయస్థానం, తృతీయస్థానంలో రాజేందర్ పైప్స్ విజయవాడ, నాలుగోస్థానంలో ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియం, ఐదో స్థానంలో ఈస్ట్ గోదావరి జట్లు నిలిచాయి. ఈసందర్భంగా జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తుంబూరి దయాకర్‌రెడ్డి, ఏలూరి లక్ష్మీనారాయణ, డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర బాల్ బ్యాడ్మింటన్ కార్యదర్శి వీ.వీ.రమణ, జిల్లా బాల్ బ్యాడిమంటన్ అసోసియేషన్ అధ్యక్షులు వేజెళ్ల సురేశ్, టోర్నీ కన్వీనర్ రాధాకృష్ణమూర్తి, నిర్వాహకులు టి.రామచంద్రమూర్తి, విజయ్‌కలామ్, బడే సాహెబ్, తిరుపతి రెడ్డి, శంకరమూర్తి తదితరులు పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు.
క్రాస్ కంట్రీ పోటీలకు జిల్లా జట్ల ఎంపిక
ఖమ్మంస్పోర్ట్స్: ఖమ్మంలో సర్దార్ పటేల్ స్టేడియంలో ఆదివారం క్రాస్ కంట్రీ పోటీలకు జిల్లా జట్లను ఎంపిక చేశారు. ఈ పోటీలకు బాలబాలికలు 20 మంది హాజరుకాగా, జట్ల వివరాలను అసోసియేసన్ జిల్లా కార్యదర్శి ఎండీ షఫీక్ అహ్మద్ ప్రకటించారు. బాలుర జట్టుకు చరణ్‌గౌడ్, ఎన్.రవి, ఎస్.సైదులు, కె.ప్రశాంత్, జె.అనిల్, బాలికల జట్టుకు పి.శ్రా వణి, ఎ.శాలిని, యు.నిషా ఎంపికయ్యారు. పోటీల నిర్వహణలో ఎం.సుధాకర్, రవి, సీహెచ్.కృష్ణయ్య, ఎన్.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
పందిళ్లపల్లి రేక్ పాయింట్‌కు చేరిన యూరియా
చింతకాని: మండలంలోని పందిళ్లపల్లి రేక్ పాయింట్‌కు ఆర్‌ఎఫ్‌సీఎల్ కంపెనీకి చెందిన 3,017.16 మెట్రిక్ టన్నుల యూరియా ఆదివారం చేరింది. టెక్నికల్ ఏఓ పవన్‌కుమార్ ఆ యూరియాను ఖమ్మం జిల్లాకు 1,417.16 మెట్రిక్ టన్నులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 420 మెట్రిక్ టన్నులు, మహబూబాబాద్ జిల్లాకు 980 మెట్రిక్ టన్నులు, ఖమ్మం సీఆర్పీకి 200 మెట్రిక్ టన్నులను కేటాయించి సరఫరా చేశారు.
ముక్కోటి ఉత్సవాల్లో ‘కళా’కాంతులు
భద్రాచలంటౌన్: భద్రాచలంలో జరుగుతున్న ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా గోదావరి తీరం ఆదివారం సందర్శకులతో నిండిపోయింది. ఏరు ఉత్సవాల సందర్భంగా నదీ తీరంలో ఏర్పాటు చేసిన ‘ఓపెన్ ఆర్ట్ స్పేస్’సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన చిత్రకారులు తమ సృజనాత్మకతకు పదును పెట్టా రు. ప్రత్యక్ష చిత్రలేఖనం (లైవ్ పెయింటింగ్) ద్వారా భక్తి భావాన్ని, ప్రకృతి సౌందర్యాన్ని కాన్వాస్‌పై అద్భుతంగా ఆవిష్కరించారు.
బోనకల్‌లో చోరీ
బోనకల్: మండల కేంద్రానికి చెందిన రైల్వే ఉద్యోగి షేక్ మహబూబ్ సుబానీ శనివారం రాత్రి తన ద్విచక్ర వాహనాన్ని ఇంటి ఆవరణలో పెట్టాడు. ఉదయం లేచి చూసేసరికి బైక్ కనిపించలేదు. ఇంట్లోని గ్యాస్ సిలిండర్ కూడా చోరీకి గురైనట్లు గుర్తించిన బాధితుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకన్న తెలిపారు.
విద్యార్థిని అదృశ్యం
ఖమ్మంఅర్బన్: ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ విద్యార్థిని కనిపించకుండా పోయిన ఘటనపై ఆదివారం కేసు నమోదైంది. బల్లేపల్లి గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువతి నగరంలోని ఓ కళాశాలలో నర్సింగ్ కోర్సు చదువుతోంది. ఆదివారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా హిందువులు పూజించే సీతాదేవి, ద్రౌపదీదేవి పట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేసిన యూట్యూబ్ చానల్ నిర్వాహకుడిపై ఖమ్మం అర్బన్ పోలీసులకు దానవాయిగూడేనికి చెందిన జి.సత్యనారాయణరావు ఆదివారం రాత్రి ఫిర్యాదు చేశారు. హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతినేలా విదేశాల్లో నివసిస్తున్న వ్యక్తి ఈ వీడియోలను అప్లోడ్ చేశాడని, ఈ వీడియోలు ఇప్పటికే వైరల్ అయ్యాయని ఆరోపించారు.
ముగిసిన బాల్‌బ్యాడ్మింటన్ టోర్నీ


