అర్ధరాత్రి యూరియా అమ్మకాలు
● అధికారుల ఆదేశాలు బేఖాతర్
చింతకాని: మండలంలోని నాగులవంచ గ్రామంలోని ఓ ఫర్టిలైజర్ దుకాణం యజమానులు నిబంధనలకు విరుద్ధంగా ఆదివారం అర్ధరాత్రి యూరియా అమ్మకాలు జరిపారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఫర్టిలైజర్ యాప్ ద్వారా యూరియా అమ్మకాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో ఎరువుల దుకాణం యజమానులు తమ వద్ద ఉన్న యూరియా నిల్వలను ఆదివారం రాత్రి 8 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని వ్యవసాయ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అధికారుల ఆదేశాలను బేఖాతర్ చేస్తూ నాగులవంచ గ్రామంలోని ఓ ఫర్టిలైజర్ దుకాణం యజమాని తన వద్ద ఉన్న యూరియా నిల్వలను ఆన్‌లైన్‌లో నమోదు చేయకుండా రైతులకు అధిక ధరతో విక్రయించాడు. దీంతోపాటు రూ.450 విలువ గల దుబ్బు గుళికలను లింకు పెట్టి విక్రయించాడు. నాగులవంచలో యూరియా అమ్మకాలు చేస్తున్నారనే విషయం రైతులకు తెలియటంతో దుకాణం వద్దకు యూరియా కోసం పెద్దఎత్తున చేరుకుని యూరియా కట్టల కోసం ఎగబడ్డారు. దీంతో ఖమ్మం – బోనకల్ ప్రధాన రహదారిపై ట్రాఫిక్ నిలిచి గందరగోళం నెలకొంది. ఈ విషయంపై మండల వ్యవసాయాధికారి మానసను వివరణ కోరగా ఎరువుల దుకాణాల్లో ఉన్న యూరియా నిల్వలను ఆదివారం రాత్రి 8 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని దుకాణ యజమానులను ఆదేశించామని, కానీ నాగులవంచలోని ఓ దుకాణం యజమాని జీరో స్టాక్‌ను ఆన్‌లైన్‌లో చూపించారని తెలిపారు.
30న ‘పీఎంశ్రీ’ క్రీడా పోటీలు
కొత్తగూడెంఅర్బన్: పీఎంశ్రీ పాఠశాలల జిల్లాస్థాయి క్రీడా పోటీలు ఈ నెల 30న పాల్వంచలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో నిర్వహించనున్నట్లు డీఈఓ బి. నాగలక్ష్మి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వాలీబాల్, కబడ్డీ, ఖో ఖో, 100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్, షార్ట్ పుట్ అంశాల్లో బాలబాలికలకు వేర్వేరుగా పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. జిల్లాస్థాయి ఫుట్‌బాల్ జట్టును కూడా ఎంపిక చేస్తామని తెలిపారు. జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఏ. నాగరాజు శేఖర్, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి వి.నరేష్ కుమార్ పోటీలను పర్యవేక్షిస్తారని వివరించారు.


