పుట్టింటికి వెళ్లి వస్తూ..
సత్తుపల్లిటౌన్: పెళ్లయి ఐదు నెలలు అయింది.. పుట్టింటికి భర్తతో కలిసి వెళ్లి తమ్ముడితో కలిసి అత్తారింటికి వస్తున్న మహిళ రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. ప్రమాదంలో ఆమె తమ్ముడు కూడా మృతిచెందాడు. ఈ ఘటన ఆదివారం సత్తుపల్లిలో చోటుచేసుకుంది. పెనుబల్లి మండలం సూరయ్యబంజర్ గ్రామానికి చెందిన పుచ్చ కృష్ణయ్య, రమాదేవి దంపతుల కుమార్తె తేజస్విని (18)కి ఏపీలోని ఏలూరు జిల్లా చింతలపూడి మండలం కండ్రికగూడెం గ్రామానికి చెందిన తోట మధుతో ఐదు నెలల క్రితం వివాహమైంది. పుట్టింటికి వచ్చిన కొత్త దంపతులు ద్విచక్ర వాహనంపై కండ్రికగూడెం బయలుదేరారు. దమ్మపేట మండలం చీపురుగూడెం ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న తేజస్విని తమ్ముడు పుచ్చా దేవేందర్ (13)ని కూడా ఎక్కించుకొని బయలుదేరారు. తన తమ్ముడిని సోమవారం ఆశ్రమ పాఠశాలలో చేర్పించేందుకు వస్తున్నారు. ఈ క్రమంలో సత్తుపల్లి శివారులో గల తమ్మిలేరు బ్రిడ్జిపై వీరి ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి అతివేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. అక్కా, తమ్ముడు తేజస్విని, దేవేందర్ అక్కడికక్కడే మృతి చెందారు. తోట మధు తీవ్రంగా గాయపడటంతో సత్తుపల్లి ఆస్పత్రికి తరలించగా చికిత్స అందించి విజయవాడ తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన లారీని గంగారం వద్ద అదుపులోకి తీసుకున్నారు.
లేకలేక కలిగిన సంతానం..
కూలి పనులు చేసుకునే పుచ్చా కృష్ణయ్య, రమాదేవి దంపతులకు పెళ్లి అయిన పదేళ్లకు తేజస్విని, దేవేందర్ జన్మించారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరూ మృతిచెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. తీవ్రంగా గాయపడిన మధు సైతం ‘నా తేజుకు ఎలా ఉందిరా..’అంటూ బంధువులను ఆరాతీయడం పలువురిని కంటతడి పెట్టించింది.
లారీ ఢీకొని అక్కా, తమ్ముడు దుర్మరణం
పుట్టింటికి వెళ్లి వస్తూ..


