ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న కాంగ్రెస్
ఖమ్మవైరారోడ్: కాంగ్రెస్ నేతలు అధికార బలంతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుండగా, మధిర నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అండ చూసుకుని కాంగ్రెస్ శ్రేణులు బీఆర్‌ఎస్ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నాయని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, జెడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు విమర్శించారు. ఖమ్మంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో ఆదివారం వారు మాట్లాడుతూ.. బోనకల్ మండలం ఆళ్లపాడులో గెలిచిన సంతోషంలో ర్యాలీ నిర్వహిస్తుంటే, కుంకుమ పడిందనే నెపంతో కాంగ్రెస్ వారు బీఆర్‌ఎస్ కార్యకర్తల తలలు పగలగొట్టారని మండిపడ్డారు. అయినా పోలీసులు మాత్రం బీఆర్‌ఎస్ కార్యకర్తలపైనే కేసు నమోదు చేశారని చెప్పారు. వైరా నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాందాస్‌నాయక్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఓటర్లను ప్రలోభపెట్టారని, తీగలబంజరలో గెలిచిన సర్పంచ్ మర్యాదపూర్వకంగా కలిస్తే బలవంతంగా కండువా కప్పారని ఎద్దేవా చేశారు. ఇక ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలం జింకలగూడెంలో బీఆర్‌ఎస్ కార్యకర్తలే లక్ష్యంగా కాంగ్రెస్ శ్రేణులు దాడులకు దిగారని ఆరోపించారు. ఇకనైనా బీఆర్‌ఎస్ కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, అధికారం ఉన్నా, లేకున్నా ప్రజల పక్షాన బీఆర్‌ఎస్ పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ ఖమ్మం నగర అధ్యక్షులు పగడాల నాగరాజు, ముదిగొండ మండల అధ్యక్షుడు వాచేపల్లి లక్ష్మారెడ్డి, నాయకులు ముత్యాల వెంకటప్పారావు, పోట్ల శ్రీనివాసరా వు, చావా వేణుబాబు, మంకెన రమేష్, గురజాల హనుమంతరావు, బొడ్డు వెంకట రామారావు, కన్నెబోయిన కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే సండ్ర,
జెడ్పీ మాజీ చైర్మన్ కమల్‌రాజ్


