
అన్నదాతల అరిగోస..
యూరియా కోసం బారులు
అయినా లభ్యత లేక ఆందోళన
రైతులకు యూరియా కష్టాలు తీరడం లేదు. వ్యవసాయ పనులను వదులుకుని పొద్దంతా పీఏసీఎస్‌ల వద్ద బారులు దీరినా ఒక బస్తా లభించడం గగనమవుతోంది. జిల్లాలోని
పలు పీఏసీఎస్‌ల వద్ద మంగళవారం ఇదే పరిస్థితి నెలకొనగా కొన్నిచోట్ల
రైతులు ఆందోళనకు దిగారు.
●రఘునాథపాలెం: రఘునాథపాలెం మండలంలోని మంచుకొండ, రఘునాథపాలెం, వీ.వీ.పాలెం పీఏసీఎస్‌లకు యూరియా వచ్చిందనే సమాచారంతో రైతులు ఉదయమే బారులు దీరారు. దీంతో పాస్‌బుక్కులు, ఆధార్ కార్డుల జిరాక్స్ తీసుకుని కూపన్లు పంపిణీ చేసిన అధికారులు యూరియా బస్తాలు అందజేశారు. సీఐ ఉస్మాన్ షరీఫ్ పర్యవేక్షణలో బందోబస్తు ఏర్పాటు చేయగా సీఈఓలు శ్రీనివాసరావు, ఎం.వెంకటేశ్వర్లు, తిరుపతిరావు పాల్గొన్నారు.
●వేంసూరు/తల్లాడ/కల్లూరు రూరల్: వేంసూరు మండలం కే.జీ.మల్లెల సొసైటీకి 15 రోజుల తరువాత 890 బస్తాల యూరియా రావడంతో 10 గ్రామాల రైతులు పోటీ పడ్డారు. దీంతో సాయంత్రం వరకు కూపన్లు పంపిణీ చేసి ఒక్కో బస్తా యూరియా అందజేశారు. తల్లాడ పీఏసీఎస్‌కు మంగళవారం తెల్లవారేసరికి వందలాది మంది రైతులు చేరుకోగా.. 8గంటలకు యూరియా లారీ వచ్చింది. కానీ 445 బస్తాల యూరియా వస్తే.. 1,200 మంది రైతులు ఉండడంతో ఏఓ ఎండీ.తాజుద్దీన్, ఎస్‌ఐ ఎన్.వెంకటకృష్ణ, సొసైటీ సీఈఓ నాగబాబు వారిని నచ్చచెప్పి 1,150 కూపన్లు పంపిణీ చేయగా మిగతా వారికి తర్వాత ఇస్తామని తెలిపారు. కల్లూరు మండలంలోని చెన్నూరు ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘానికి 330 బస్తాలు రాగా 700 మంది రైతులు ఉండడంతో సిబ్బంది గోదాంకు తాళం వేశారు. మరో 30 టన్నుల యూరియా వచ్చాకే పంపిణీ చేస్తామని చెప్పడంతో రైతులు ఆందోళనకు దిగగా ఏఓ ఎం.రూప, పోలీసులు నచ్చచెప్పారు.
●కొణిజర్ల/ఏన్కూరు: యూరియా లభ్యత లేక రైతులు కొణిజర్లలో రాస్తారోకోకు దిగారు. గోపవరం పీఏసీఎస్‌కు 300 బస్తాల యూరియా రావడంతో రైతులకు రెండేసి కూపన్లు ఇచ్చారు. ఇంకొందరు రైతులు రాగా కూపన్లు లేవని చెప్పగా నిరసన తెలిపారు. దీంతో పోలీసులు, ఏఓ బాలాజీ నచ్చచెప్పగా ఆందోళన విరమించినా యూరియా దిగుమతి చేయకుండా అడ్డుకున్నారు. ఈక్రమాన అందరికీ ఒక్కో బస్తా ఇస్తామని చెప్పగా ఆందోళన విరమించారు. ఇక ఏన్కూరు పీఏసీఎస్ వద్ద పోలీసుల సహకారంతో యూరియా పంపిణీ చేశారు.
●ముదిగొండ/బోనకల్: ముదిగొండ మండలం మేడేపల్లి సొసైటీలో మంగళవారం 200 బస్తాల యూరియా వస్తే 800మంది రైతులు పోటీపడ్డారు. దీంతో వ్యవసాయ అధికారులు, పోలీసులు మరో 10మెట్రిక్ టన్నుల యూరియా వస్తుందని నచ్చజెప్పారు. అనంతరం ఒక్కో రైతుకు ఒక్కో బస్తా చొప్పున యూరియా సరఫరా చేసినట్లు ఏఓ సరిత తెలిపారు. అలాగే, బోనకల్ మండలంలోని రావి నూతల, బ్రాహ్మణపల్లి, కలకోట, పెద్దబీరవల్లి సొసైటీలకు మంగళవారం 10టన్నుల చొప్పున యూరియా వస్తే పెద్దసంఖ్యలో రైతులు పోటీపడ్డారు. బ్రాహ్మణపల్లి సొసైటీలో రాపల్లి రైతులు కూడా సభ్యులు కావడంతో బ్రాహ్మణపల్లి రైతులకే ఇవ్వడంపై అభ్యంతరం తెలిపారు. పీఏసీఎస్‌ల్లో యూరియా పంపిణీని మధిర ఏడీఏ స్వర్ణ విజయచంద్ర, ఏఓ వినయ్‌కుమార్ పరిశీలించారు.

అన్నదాతల అరిగోస..

అన్నదాతల అరిగోస..

అన్నదాతల అరిగోస..