
యూరియా.. కరువాయే..
సిఫారసు మేరకే వాడాలి
యూరియా అందించలేకపోతున్నాం
● పీఏసీఎస్‌ల ద్వారా అరకొరగానే పంపిణీ ● ఇండెంట్‌కు అనుగుణంగా సరఫరా లేక ఇక్కట్లు ● పైర్ల కీలకదశలో అన్నదాతల ఆవేదన
ఖమ్మంవ్యవసాయం: యూరియా కొరత అన్నదాతలను అష్టకష్టాలు పెడుతోంది. వానాకాలం పంటల సాగు అంచనాలు దాటగా.. పైర్లకు యూరియా అందించాల్సిన కీలకమైన సమయంలో లభ్యత లేక ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో ఈ వానాకాలంలో అన్ని పంటలు కలిపి 6,60,657 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఇందులో వరి 2,89,553 ఎకరాల్లో, పత్తి 2,25,613 ఎకరాల్లో సాగవుతోంది. ఈ పంటలకు అనుగుణంగా ఈనెల వరకు జిల్లాకు 54,826 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా కావాల్సి ఉంది. కానీ 20,012 మెట్రిక్ టన్నులు మాత్రమే రావడంతో అరకొరగా పంపిణీ చేస్తుండగా రైతులు పడిగాపులు కాస్తున్నారు.
వరికి అవసరం
వరికి ఈ సమయాన యూరియా అందించడం ప్రధానం. నాట్లు వేశాక 15 రోజుల వ్యవధి నుంచి దఫాల వారీగా అందించాల్సి ఉంటుంది. ప్రస్తుతం వరి 30 – 40 రోజుల దశలో ఉండగా యూరియా కొరత ఏర్పడింది. ఈ దశలో సరిపడా అందించకపోతే దిగుబడిపై ప్రభావం పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ నత్రజనితో కూడిన ఎరువులు వినియోగించాలన్నా ధర ఎక్కువగా ఉండడంతో అటు మొగ్గు చూపడం లేదు. యూరియా బస్తా ధర రూ. 266 కాగా, ఇతర కాంప్లెక్స్ ఎరువుల ధరలు రూ.1,500 వరకు ఉన్నాయి. జిల్లాకు గత వారం వచ్చిన 938 మెట్రిక్ టన్నుల యూరియాను పీఏసీఎస్‌ల ద్వారా సరఫరా చేస్తున్నా రైతుకు ఒక బస్తా కూడా అందడం లేదు. ఫలితంగా పలు ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచే బారులు తీరుతున్నారు. అయినా అందరికీ యూరియా అందక కూపన్లు జారీ చేస్తున్నా అధికారులు ఒకటి, రెండు రోజుల్లో సరఫరా చేస్తామని నచ్చచెప్పి పంపిస్తున్నారు.
పంటలకు సిఫారసు మేరకే యూరియా వినియోగించాలి. అధిక దిగుబడి వస్తుందని ఎక్కువగా వాడొద్దు. వరిలో ఎకరాకు మూడు దఫాలుగా 60 కిలోల యూరియా వినియోగిస్తే చాలు. చాలామంది ఎక్కువ వాడుతుండడంతో సమస్య పెరుగుతోంది.
– ధనసరి పుల్లయ్య, జిల్లా వ్యవసాయాధికారి
పంటలకు యూరియా అందించలేకపోతున్నాం. అవసరమైన సమయంలో యూరియా లభించడం లేదు. ఈ ప్రభావం దిగుబడులపై పడుతుందనే ఆందోళన ఉంది. ఒక్కో రైతుకు ఒక బస్తా యూరియానే ఇస్తే ఎలా సరిపోతుందో అధికారులే ఆలోచించాలి. – చామకూరి రమేష్, పిండిప్రోలు