
హాస్టళ్లు, గురుకులాలపై నిఘా
ఓపక్క ప్రత్యేక అధికారులు,
ఇంకో పక్క ఏసీబీ తనిఖీలు
వారానికోరోజు తనిఖీ చేసేలా ఆదేశం
విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిలో అలజడి
ఖమ్మంమయూరిసెంటర్: జిల్లాలోని వివిధ సంక్షేమ శాఖల వసతి గృహాలు, గురుకుల పాఠశాలలు ఇకపై ప్రభుత్వం, జిల్లా పాలన అధికారుల నిఘాలోకి రానున్నాయి. విద్యార్థులకు మెరుగైన వసతుల కల్పన, పారదర్శకత పెంపు, అవినీతిని అరికట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రతీనెల వసతిగృహాలు, గురుకులాలను తనిఖీ చేసేందుకు కలెక్టర్ ప్రత్యేక అధికారులను నియమించగా.. వీటికి తోడు ఆకస్మిక దాడులకు శ్రీకారం చుట్టారు. ఇందులో ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) అధికారులు కూడా భాగం కావడం విశేషం.
అన్ని శాఖలకూ బాధ్యతలు
కలెక్టర్ ఆదేశాల మేరకు వసతి గృహాలు, గురుకులాల పర్యవేక్షణకు కొత్త వ్యవస్థ ఏర్పాటైంది. ఇకపై కేవలం సంక్షేమ శాఖ అధికారులే కాక ఇతర శాఖలకు అధికారులు సైతం వారానికోసారి తప్పక తనిఖీ చేయాలి. ఈ తనిఖీ బృందంలో రెవెన్యూ, మున్సిపల్, ఎంపీడీఓ, ఎంపీఓ, విద్యాశాఖల అధికారులతో పాటు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు భాగం కానున్నారు. తద్వారా వసతి గృహాల నిర్వహణలో లోపాలు బయటపడతాయని భావిస్తున్నారు.
నివేదికలు, సమీక్షలు
జిల్లాలో రెండు నెలలుగా ప్రత్యేక అధికారులు వసతిగృహాలు, గురుకులాలను నెలకోసారి తనిఖీ చేస్తున్నారు. ఈ తనిఖీలు మరింత పకడ్బందీగా జరిగేలా జిల్లా పాలన అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా వివిధ శాఖల అధికారులు.. ప్రతీ బుధవారం, గురువారం తమకు కేటాయించిన వసతిగృహాలు, గురుకులాలను తనిఖీ చేయాల్సి ఉంటుది. ఒక్కొక్కరికి ఒకటి నుండి రెండు హాస్టళ్ల చొప్పున కేటాయించినట్లు తెలిసింది. ఒకటి మాత్రమే ఉన్న వారు బుధవారం, రెండు హాస్టళ్ల బాధ్యత ఉన్న వారు బుధవారం, గురువారం తనిఖీ చేయాల్సి ఉంటుంది. ఈ సమయాన అధికారులు వసతిగృహాలు, గురుకులాల్లో తప్పనిసరిగా భోజనం చేయాలి. తనిఖీల్లో వెల్లడైన లోపాలతో నివేదికను సమర్పిస్తే అదనపు కలెక్టర్ ప్రతీ సోమవారం సమీక్షించనున్నట్లు సమాచారం.
పలు అంశాలపై ప్రత్యేక దృష్టి
తనిఖీల్లో భాగంగా అధికారులు మూడు కీలక అంశాలపై దృష్టి సారిస్తున్నారు. భోజనం నాణ్యత, ప్రభుత్వం నిర్దేశించిన మెనూ అమలుతో పాటు ఆహార పదార్థాల నిల్వలు, వంట గది పరిశుభ్రత, వంట సిబ్బంది పరిశుభ్రత తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అంతేకాక అవినీతిని అరికట్టేందుకు రేషన్ స్టాక్‌ను రిజస్టర్లతో పోల్చి చూస్తున్నారు. విద్యార్థులు నివసించే గదులు, పడకలు, మరుగుదొడ్లు, స్నానాల గదుల పారిశుద్ధ్యంపైనా ప్రత్యేక దృష్టి పెట్టారు. తాగునీరు, విద్యుత్ సరఫరా, భద్రతా ఏర్పాట్లు వంటి మౌలిక వసతులు సరిగా ఉన్నాయా, లేదా అని పరిశీలించి విద్యార్థుల హాజరును సైతం తనిఖీ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రతీ వారం తనిఖీల్లో హాజరు నమోదు, వసతిగృహంలో ఉన్న విద్యార్థుల సంఖ్యను సరిపోలుస్తున్నారు. ఇక సాధారణ తనిఖీలతో పాటు ఏసీబీ అధికారుల ఆకస్మిక దాడులు వసతిగృహాల నిర్వాహకుల్లో వణుకు పుట్టిస్తున్నాయి. ఇటీవల తనికెళ్ల సమీపాన మైనార్టీ గురుకులంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేయడం ఇందుకు కారణమవుతోంది. ఈ తనిఖీలు నిరంతరం కొనసాగనున్నట్లు తెలుస్తోంది.
వారిలో ఆందోళన
అధికారుల తనిఖీలతో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే సంక్షేమ అధికారుల్లో అలజడి నెలకొందని సమాచారం. గ్రామీణ ప్రాంతాల్లోని వసతిగృహాల అధికారులు సమయపాలన పాటించడం లేదని, జిల్లా, మండల కేంద్రాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుత తనిఖీలతో తమ లోపాలు ఎక్కడ వెలుగులోకి వస్తాయోనని వారిలో చర్చ జరుగుతోందని తెలిసింది. ఇక కొందరు విద్యార్థులు లేకున్నా హాజరు నమోదు చేస్తున్నారని.. సత్తుపల్లి డివిజన్‌లో ఈ వ్యవహారం అధికంగా ఉన్నట్లు చెబుతున్నారు. అధికారులు క్రమం తప్పక తనిఖీలు చేపడితే ఇలాంటి అంశాలు బయటపడడమే కాకుండా వసతిగృహాలు, గురుకులాల నిర్వహణ గాడిన పడుతుందని విద్యార్థి సంఘాల నేతలు పేర్కొంటున్నారు.