
రేపు జీపీఓలకు నియామకపత్రాలు
ఖమ్మం సహకారనగర్: సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఈనెల 5న హైదరాబాద్‌లో గ్రామ పరిపాలన అధికారులు(జీపీఓ)లకు నియామకపత్రాలు అందించనున్నట్లు సీసీఎల్‌ఏ కార్యదర్శి లోకేష్‌కుమార్ తెలిపారు. హైదరాబాద్ నుంచి బుధవారం ఆయన వీసీ ద్వారా సమీక్షించగా జిల్లా నుంచి కలెక్టర్ అనుదీప్, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్‌కుమార్ మాట్లాడుతూ జీపీఓ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను హైదరాబాద్ పంపించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. అనంతరం కలెక్టర్ అధికారులతో సమావేశమై సూచనలు చేశారు. జిల్లా నుంచి 307మంది ఉండగా, ఆరు బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వీరికి సొంత మండలంలో కాకుండా కౌన్సెలింగ్ ద్వారా పోస్టింగ్ ఇవ్వనున్నట్లు చెప్పారు. సమీక్షలో డీఆర్‌ఓ ఏ.పద్మశ్రీ, కలెక్టరేట్ ఏఓ కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం కాజీపేట – విజయవాడ మూడో రైల్వేలైన్, ఇతర ప్రాజెక్టుల భూసేకరణపై కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ మనోజ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్టారావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూచనలు చేశారు.