
పది రోజుల్లో ప్రత్యేక దృష్టి
ఎమ్మెల్యేల నుంచి
విజ్ఞాపనలు అందాయి..
త్వరలోనే వారితో మంత్రుల భేటీ
ఆపై ప్రాధాన్యతా క్రమంలో
సమస్యల పరిష్కారం
దామరచర్ల సభలో
సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడి
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన తనకు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు పలు సమస్యలపై విజ్ఞాపన పత్రాలు అందజేశారని, వీటన్నింటిపై పది రోజుల్లో ప్రభుత్వ పరంగా దృష్టి సారిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. చండ్రుగొండ మండలం బెండాలపాడులో బుధవారం ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం అనంతరం దామరచర్లలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే..
కొత్తగూడెం, ఇల్లెందు, భద్రాచలం, వైరా, సత్తుపల్లి, పినపాక, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల సమస్యలు, పనులపై వినతిపత్రాలు ఇచ్చారు. పది రోజుల్లో వారితో మాట్లాడాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెప్పా. వినతిపత్రాలు, ప్రతిపాదనలపై జిల్లా అధికారులతో చర్చించి అన్ని సమస్యలు పరిష్కరిస్తాం. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల వద్దే కీలక శాఖలు ఉన్నాయి.
సారపాకలో సన్న బియ్యం భోజనం..
గతంలో రేషన్‌కార్డులపై పేదలకు దొడ్డుబియ్యం పంపిణీ చేసేవారు. ఆ బియ్యంతో అన్నం తినలేక చాలా మంది అమ్ముకునే వారు. కానీ మా ప్రభుత్వం వచ్చాక పేదలకు సన్న బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించాం. సారపాకలో సామాన్యుడి ఇంట్లో భోజనం చేయడానికి వెళ్లినప్పుడు రేషన్‌కార్డుపై వచ్చిన బియ్యంతోనే అన్నం వండమని చెప్పాం. ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దుకుంటామని చెప్పా. కానీ ఆ ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు జూబ్లీహిల్స్‌లోని మా ఇంట్లో, శీనన్న(పొంగులేటి శ్రీనివాసరెడ్డి) ఇంట్లో అన్నం తిన్నట్టే అనిపించింది. సన్నబియ్యంతో అన్నం తింటున్నప్పుడు సామాన్యుడి కళ్లలో కనిపించే ఆనందం కోటి రూపాయలు ఇచ్చినా రాదు.
ఆత్మగౌరవంతో బతికేలా
తొలిదశ తెలంగాణ ఉద్యమం పాల్వంచలో ప్రారంభమై తెలంగాణకు దిశాదశ చూపించింది. ఏ సమస్య వచ్చినా ముందుగా స్పందించేది ఖమ్మం జిల్లానే. ఈ జిల్లా వాసులు సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. ఇక్కడ గూడేలు, తండాల వారికి తల్లితో సమానంగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీపై గౌరవం ఉంది. అందుకే పేదల సొంతింటి కలను ఇందిరమ్మ ఇళ్ల పథకం నిజం చేస్తోంది. పేదలు సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు గడిచిన పదేళ్లుగా ఎదురుచూసి నిరాశ చెందారు. ఇప్పుడు నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్రంలో 4.50లక్షల ఇళ్లు నిర్మిస్తున్నాం. అశ్వారావుపేటకు మాత్రం ఏకంగా 4,500 ఇళ్లు ఇచ్చాం. ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే.
2–30 గంటల పాటు..
షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 2:20 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి చండ్రుగొండకు రావాల్సి ఉంది. అయితే మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటన కారణంగా మధ్యాహ్నం 3 : 40 గంటలకు చండ్రుగొండకు చేరుకున్నారు. తొలుత బెండాలపాడులో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశంలో పాల్గొన్నాక పైలాన్ ఆవిష్కరించి ఇందిరమ్మ లబ్ధిదారులతో మాటామంతీ నిర్వహించారు. ఆ తర్వాత దామరచర్లలో బహిరంగ సభాస్థలికి చేరుకున్నారు. అక్కడ 29 నిమిషాల పాటు ప్రసంగించిన సీఎం.. సాయంత్రం 6 : 10 గంటలకు తిరుగు పయనమయ్యారు. మొత్తంగా రెండున్నర గంటల పాటు జిల్లాలో సీఎం పర్యటన కొనసాగింది.
సంక్షేమానికి మారుపేరు వైఎస్సార్
సాక్షిప్రతినిధి, ఖమ్మం: దామరచర్లలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్న సభలో వక్తలు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి నామస్మరణ చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రస్తావించినప్పుడల్లా అభిమానులు, ప్రజలు కేరింతలు కొట్టారు. సీఎం తన ప్రసంగంలో వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తుండగా ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. వైఎస్ ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించారని, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉచిత విద్యుత్, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి వాకిటి శ్రీహరి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కూడా తమ ప్రసంగాల్లో వైఎస్సార్ పేరు ప్రస్తావించారు. ఆయన సంక్షేమ పథకాలను అమలు చేశారని కొనియాడే సమయాన ప్రజలు ఈలలు, చప్పట్లతో తమ హర్షాతిరేకాలు వెలిబుచ్చారు.

పది రోజుల్లో ప్రత్యేక దృష్టి

పది రోజుల్లో ప్రత్యేక దృష్టి

పది రోజుల్లో ప్రత్యేక దృష్టి

పది రోజుల్లో ప్రత్యేక దృష్టి