
ఇందిరమ్మ ఇంటి నాణ్యతపై రేవంత్ ఆరా
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో రిబ్బన్ కటింగ్‌కే సీఎం రేవంత్‌రెడ్డి పరిమితం కాలేదు. ఇంజనీర్ తరహాలో ప్రతీ గోడను పరిశీలించారు. ఎలా నిర్మించారు.. నాణ్యత ఉందా లేదా అని ఆరా తీశారు. నిర్మాణ నాణ్యతపై సంతృప్తి చెందిన సీఎం, ఇదే తరహాలో ఇతర చోట్ల కూడా నిర్మించాలని అధికారులకు సూచించారు.
ఓనర్ రమణమ్మ గారూ.. రండి !
బెండాలపాడులో గృహప్రవేశం సమయంలో పూజ పూర్తయిన వెంటనే కొబ్బరికాయ కొట్టే సమయంలో ‘ఇంటి ఓనర్ రమణమ్మ గారూ.. రండి’ అని సీఎం రేవంత్‌రెడ్డి పిలిచారు. ఇల్లు బాగుందని మెచ్చుకున్నారు. ఈ సమయంలో రమణమ్మ కూతురు లిఖితను ఏం చదువుతున్నావని ప్రశ్నించగా.. డిగ్రీ చదువుతున్నానని బదులిచ్చింది. బాగా చదువుకోవాలని సీఎం సూచించారు. అనంతరం ఆ ఇంటి ఆవరణలో కొబ్బరి మొక్క నాటి.. ఇది ఎంత ఎదిగితే మీ కుటుంబం అంత పచ్చగా ఉంటుందన్నారు. అనంతరం కుటుంబంతో ఫొటో దిగారు.
ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా ?
‘నర్సమ్మా.. అంతా సంతోషమేనా, ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా’ అని రేవంత్‌రెడ్డి అడిగినప్పుడు ‘మాకు అంతా మంచే జరిగింది సార్, మీరు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది.. సీఎం సార్ వచ్చి మా ఇల్లు ఓపెన్ చేస్తారని అస్సలు అనుకోలేదు అంటూ ఆమె బదులిచ్చింది. అనంతరం ఇంట్లో చాప మీద కూర్చున్నాక ఇంటిని పరిశీలిస్తూ పిల్లర్లు వేసి కట్టారా లేక గోడ మీదనే శ్లాబ్ వేశారా అని అడిగారు. పిల్లర్లు వేసి కట్టామంటూ నర్సమ్మ కుటుంబ సభ్యులు చెప్పగా.. అలా కడితేనే ఇల్లు బాగా ఆగుతుందని సీఎం అన్నారు.
ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డికి మక్క గారెలు, పాయసం అందించారు. నర్సమ్మ ఒడిలో ఉన్న ఆమె మనుమరాలు పాన్యశ్రీ వెన్సికకు సీఎం పాయసం తినిపించారు. ‘నీ పేరేంటి, ఏ ఊరు’ అని అడగగా.. ఆ చిన్నారి నమస్తే సార్ అంటూ బదులిచ్చింది. గృహ ప్రవేశం సందర్భంగా కుటుంబసభ్యులకు చీర, ప్యాంటు, షర్టులను ప్రభుత్వం తరఫున సీఎం అందించారు. తమ గ్రామానికి పీహెచ్‌సీ కావాలని సీఎంను కోరుదామనుకున్నామని, కానీ హడావుడిలో సాధ్యం కాలేదని ఇందిరమ్మ లబ్ధిదారులు తెలిపారు.