కాంగ్రెస్‌లో జోష్
అందుకే జై కొట్టారు..
జిల్లాలో పూర్తయిన మొదటి, రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు జయకేతనం ఎగురవేశారు. ప్రధానంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ప్రాతినిధ్యం
వహిస్తున్న మధిర, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరుల్లో కాంగ్రెస్ మద్దతుదారులు అత్యధిక స్థానాలు
కై వసం చేసుకున్నారు. మరికొన్ని స్థానాల్లో స్వల్ప తేడాతో ఓటమి
చవిచూశారు. ఈ రెండు విడతల్లోనూ వచ్చిన ఫలితాలపై పార్టీ
నాయకత్వం సంతృప్తి వ్యక్తం చేస్తూ, మూడో విడత ఎన్నికల్లో మరింత మెరుగైన ఫలితాలు రాబట్టే లక్ష్యంతో పనిచేయాలని కార్యకర్తలకు
సూచించింది. – సాక్షిప్రతినిధి, ఖమ్మం
మధిర, పాలేరు నియోజకవర్గాల్లో సత్తా చాటిన పార్టీ
మధిరలో కాంగ్రెస్ ఢంకా
మధిర నియోజకవర్గ పరిధి మధిర, బోనకల్, చింతకాని, ఎర్రుపాలెం మండలాల్లో మొదటి విడతగా, ముదిగొండ మండలానికి రెండో విడతలో ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 131 జీపీ స్థానాలకు 90చోట్ల కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచారు. ఎర్రుపాలెం మండలంలో 31 స్థానాలకు 26, మధిర మండలంలో 27కు 19, బోనకల్‌లో 22కు 14, చింతకానిలో 26కు 13 జీపీ స్థానాల్లో నెగ్గింది. ముదిగొండ మండలంలో 25 స్థానాలకు గాను 18లో సత్తా చాటింది. ఏకగ్రీవాలతోపాటు ఎన్నికలు జరిగిన పంచాయతీల్లో కాంగ్రెస్‌కు ఏకపక్షంగానే ఓటింగ్ జరగగా, పలు మండలాల్లో బీఆర్‌ఎస్, సీపీఎం పొత్తుతో కొంత ప్రభావం కనిపించిందని చెబుతున్నారు.
పాలేరులోనూ పట్టం
రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలోని గ్రామపంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతుదారులు జెండా పాతారు. ఇక్కడ రెండో విడతలో ఎన్నికలు జరిగాయి. కూసుమంచి, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, ఖమ్మంరూరల్ మండలాల్లో 134 గ్రామపంచాయతీలకు గాను 83 స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధించారు. బీఆర్‌ఎస్ 34 స్థానాల్లో, సీపీఎం ఎనిమిది, సీపీఐ మూడు, ఇతరులు ఆరు స్థానాల్లో గెలిచారు. ఈ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్, సీపీఎం పొత్తుతో కొన్ని స్థానాలను కాంగ్రెస్ స్వల్ప తేడాతో కోల్పోయినా పలు మేజర్ గ్రామపంచాయతీలు కాంగ్రెస్ ఖాతాలో చేరాయి.
స్వల్ప తేడాతో మరికొన్ని..
రెండు నియోజకవర్గాల్లో అత్యధిక స్థానాలను కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచినా, మరికొన్ని స్థానాలను కోల్పోయారు. కొన్నిచోట్ల ఒకటి నుంచి 30ఓట్ల తేడాతో ఓడిపోగా, చాలాస్థానాల్లో కాంగ్రెస్ రెబెల్స్ బరిలో ఉండడం ఇందుకు కారణమైందని చెబుతున్నారు. గ్రామస్థాయి నేతల్లో మనస్పర్థలతో గెలవాల్సిన జీపీలను కూడా కోల్పోయామని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఇక సీపీఎం, బీఆర్‌ఎస్ పొత్తుగా పోటీ చేయడం కూడా కొన్ని స్థానాలు కోల్పోవడానికి కారణంగా భావిస్తున్నారు. మూడో విడతలో మరింత మెరుగైన ఫలితాలు వచ్చేలా విభేదాలు లేకుండా పనిచేసేలా నాయకులు సూచిస్తున్నారు. మూడో విడత ఎన్నికలు జరిగే జీపీల్లో ప్రచార గడువు ముగిసినందున కాంగ్రెస్ పార్టీ యంత్రాంగం పోల్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారించింది.
గ్రామపంచాయతీ ఎన్నికలు పార్టీల రహితంగా జరిగినా, పార్టీల మద్దతుతోనే అభ్యర్థులు బరిలో దిగారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచాయి. ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతోనే ఓటర్లు తమకు పట్టం కట్టారని అభ్యర్థులు చెబుతున్నారు. ప్రచారంలో కూడా అభ్యర్థులు ప్రభుత్వ పథకాలను ఓటర్లకు వివరిస్తూ తమకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం మంచి ప్రభావాన్ని చూపిందని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
కాంగ్రెస్‌లో జోష్


