ఇక ప్రలోభాల పర్వం!
● మూడో విడతకు ముగిసిన ప్రచారం ● గెలుపు కోసం అభ్యర్థుల వ్యూహాలు ● ఏడు మండలాల్లో జోరుగా మద్యం, డబ్బు పంపిణీ
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: మూడో విడత ఎన్నికలు జరిగే ఏన్కూరు, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, తల్లాడ, వేంసూరు, సింగరేణి మండలాల్లో సోమవారంతో ప్రచారం ముగిసింది. దీంతో అభ్యర్థులు ఇతర మార్గాల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. చివరి రోజున అభ్యర్థులు జోరుగా ప్రచారం చేశాక కొత్త అస్త్రాలను తీసే పనిలో పడ్డారు. పోలింగ్‌కు ఒకేరోజు సమయం ఉండడంతో గుట్టుచప్పుడు కాకుండా ఓటర్లను కలుస్తూ ఒప్పందాలు చేసుకుంటున్నారు.
168 జీపీల్లో ఎన్నికలు
ఏడు మండలాల్లో 191 గ్రామపంచాయతీలకు మూడో విడతలో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే, ఏన్కూరు మండలం నూకాలంపాడు గ్రామపంచాయతీకి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాకపోగా, 22 గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 168 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అలాగే 1,742 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాని తొమ్మిది, ఏకగ్రీవమైన 361 వార్డులు మినహా 1,372 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, పార్టీల నాయకులతో కలిసి చివరి రోజైన సోమవారం వరకు ప్రచారం హోరెత్తించారు.
వ్యూహాలకు పదును
ప్రచారం ముగియడంతో అభ్యర్థులు గెలుపు కోసం వ్యూహాలకు పదును పెట్టారు. గ్రామాల్లో ఎందరు ఓటర్లు ఉన్నారు, అందులో ఎవరెవరు తమకు ఓటు వేస్తారు... ఎవరిని ఎలా ప్రసన్నం చేసుకునే అవకాశముందనే అంశాలపై దృష్టి సారించారు. అంతేకాక ఎదుటి వర్గంలో పోటీ చేసే అవకాశం దక్కక నిరాశతో ఉన్నవారిని తమ వైపు తిప్పుకునేలా చర్చలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. వీరితో చేతులు కలపడం ద్వారా తమ గెలుపును సునాయాసం చేసుకోవాలనే భావనలో ఉన్నారు. ఓటరు జాబితా ఆధారంగా ప్రతీ ఒక్కరినీ కలిసేలా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈక్రమంలో ఒకరిని మించి ఇంకొకరు మద్యం, డబ్బు పంపిణీ చేస్తుండగా, ఇంటింటికీ మటన్, చికెన్ కూడా చేరవేస్తున్నట్లు తెలుస్తోంది.


