రద్దయిన సర్వీసుల పునరుద్ధరణ
● దశల వారీగా డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు ● టీజీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్, ఎండీ వై.నాగిరెడ్డి
ఖమ్మంమయూరిసెంటర్: కోవిడ్ సమయాన గ్రామీణ ప్రాంతాలకు నిలిపేసిన బస్సులన్నీ తిరిగి ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్, ఎండీ వై.నాగిరెడ్డి తెలిపారు. ఖమ్మం కొత్త బస్టాండ్‌లోని కార్గో పాయింట్, ప్లాట్‌ఫామ్స్, దుకాణాలను సోమవారం ఆయన తనిఖీ చేశారు. రాజధాని బస్సులో ప్రయాణికులతో మాట్లాడి సౌకర్యాలు, ప్రయాణ సమయం, సమస్యలపై ఆరా తీశారు. అనంతరం ఎండీ మాట్లాడుతూ రెండేళ్లలో మహాలక్ష్మి పథకం ద్వారా 250 కోట్ల ప్రయాణాలు జరగగా, రూ.8,500 కోట్లను ప్రభుత్వం భరించిందని తెలిపారు. ఈ నగదు మహిళలకు ఆదా అయిందని చెప్పారు. భవిష్యత్‌లో ఎలక్ట్రికల్ బస్సుల ధరలు తగ్గే కొద్దీ డీజిల్ బస్సుల స్థానంలో ప్రవేశపెడతామన్నారు. మహిళా సంఘాల ద్వారా 600బస్సులను తీసుకుంటామని, సంస్థలో వేయి మంది డ్రైవర్లు, 761 మంది శ్రామిక్‌ల నియామక ప్రక్రియ చేపడుతున్నామని తెలిపారు.
ఖమ్మం రీజియన్ కొంత నష్టాల్లో ఉంది
ఖమ్మం రీజియన్‌లోని అన్ని డిపోల పరిధిలో అవసరమైన రూట్లలో బస్సులు ఏర్పాటు చేయడంతో పాటు రూట్లలో సర్వీసుల సంఖ్య పెంచాలని ఎండీ వై.నాగిరెడ్డి సూచించారు. ఓ ప్రయాణికుడు బస్టాండ్‌లోని స్టాళ్లలో ఎంఆర్‌పీకి మించి వసూలు చేస్తున్నారని ఫిర్యాదు చేయడంతో చర్యలు తీసుకోవాలని ఆర్‌ఎంకు సూచించారు. కాగా, రాష్ట్రం మొత్తంగా చూస్తే ఖమ్మం రీజియన్ కొంత నష్టాల్లో ఉందని తెలిపారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడిపించడం, గ్రామాలకు రహదారులు బాగుంటే కొత్త సర్వీసులు ఏర్పాటు చేయడంద్వారా ఆదాయం పెంచుకోవాలని అధికారులకు సూచించారు. తొలుత ఆర్‌ఎం సరిరామ్ ఎండీకి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. డిప్యూటీ ఆర్‌ఎం వి.మల్లయ్య, ఖమ్మం డీఎం ఎం.శివప్రసాద్, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఎం.రవీందర్, ఉద్యోగులు వి.జ్యోత్స్న, పి.సంపత్, కోటాజీ తదితరులు పాల్గొనగా, అద్దె బస్సుల ఓనర్లు ఎండీని మర్యాదపూర్వకంగా కలిశారు.


