భక్తులపైనే భారం..
● భద్రగిరిలో ముక్కోటి వేడుకలకు అందని సర్కారు సాయం ● పగల్‌పత్తు ఉత్సవాల నిర్వహణకు దాతలకు పిలుపు
భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థాన అధికారులు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఉత్సవాల ఖర్చులు పెరుగు తున్నా ప్రభుత్వ సాయం అందక ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. ఈక్రమాన పగల్ పత్తు ఉత్సవాల్లో రోజుకో సంస్థ ఖర్చు భరించి భాగస్వాములయ్యేలా ప్రతిపాదించారు. దీంతో ఖర్చులు దాతలపై వేస్తున్నందుకు బాధపడాలో, ఉత్సవంలో భాగస్వాములు అవుతున్నందుకు ఆనందించాలో తేల్చుకోలేని సందిగ్ధావస్థ ఎదురవుతోంది.
పెరుగుతున్న వ్యయం
భద్రాచలంలో ముక్కోటి, శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తుండగా దేశ నలుమూలల నుంచి భక్తులు వస్తారు. ఇందుకు అనుగుణంగా చేసే ఏర్పాట్లకు ఖర్చు పెరుగుతోంది. ఈనెల 20 నుంచి ప్రారంభమయ్యే ముక్కోటి ఉత్సవాల పనులకు ఇప్పటికే రూ.80 లక్షలకు టెండర్ దాఖలైంది. వీటికి అదనంగా మరో రూ.50 లక్షల వరకు ఖర్చవుతాయని అంచనా. అలాగే, శ్రీరామనవమి, పట్టాభిషేకానికి సుమారు రూ.2 కోట్ల వ్యయాన్నీ హుండీ ఆదాయం నుంచే భరించాల్సి వస్తోంది.
‘పగల్‌పత్తు’లో భాగం కండి..
ఆలయంపై పడుతున్న భారాన్ని తట్టుకునేందుకు అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకున్నారు. ముక్కోటి ఉత్సవాల్లో మొదటి తొమ్మిది రోజులు స్వామి రోజొక అవతారంలో దర్శనమిస్తారు. వీటిని పగల్ పత్తు ఉత్సవాలు అంటారు. ముక్కోటి తర్వాత జరిగే రాపత్తు ఉత్సవాలను ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల వారే ఖర్చు భరించి నిర్వహిస్తున్నారు. ఈసారి పగల్‌పత్తు ఉత్సవాలనూ రోజొక ధార్మిక సంస్థ లేదా అసోయేషన్లు నిర్వహించేలా వీలు కల్పించారు. చాంబర్ ఆఫ్ కామర్స్, స్వచ్చంద, ధార్మిక సంస్థలతో సమావేశం నిర్వహించగా రోజుకు రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకు ఖర్చు భరించేందుకు కొన్నిసంస్థలు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ప్రభుత్వాలు మారినా.. సాయం సున్నా
భద్రాచల క్షేత్రంలో ఉత్సవాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందడం లేదు. ప్రత్యేక నిధులు కేటాయించాలని భక్తులు కోరుతున్నా, ఆల యం నుంచి నివేదించినా ఫలితం లేదు. ప్రభుత్వాలు మారుతున్నా పరిస్థితిలో మార్పు లేకపోవడంపై విమర్శలొస్తున్నాయి. ఆలయ ఈఓ కె.దామోదర్ రావు మాట్లాడుతూ ముక్కోటి ఉత్సవాల్లో భక్తులను భాగస్వాములను చేసేందుకే దాతలను ఆశ్రయించామని తెలిపారు. తద్వారా దేవస్థానంపై వ్యయ భారం తప్పుతుందని పేర్కొన్నారు.


