నిర్దిష్ట లక్ష్యాలతోనే విజయాలు
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మంఅర్బన్: విద్యార్థులు భవిష్యత్‌పై నిర్దిష్ట లక్ష్యాలను ఎంచుకుని సాధన చేస్తే విజయాలు వరిస్తాయని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఖమ్మం టేకులపల్లిలోని మహిళా ప్రాంగణంలో శిక్షణ పొందిన విద్యార్థినులు ఎంపీహెచ్‌డబ్ల్యూ పరీక్షల్లో రాష్ట్ర స్థాయి 2, 4, 5, 7, 8, 10వ ర్యాంకులు సాధించగా వారిని సోమవారం కలెక్టర్ అభినందించి మాట్లాడారు. పేద కుటుంబాలు, ఏజెన్సీ ప్రాంతాల విద్యార్థినులు ఇక్కడితో ఆగిపోకుండా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి జీవితంలో స్థిరపడాలని సూచించారు. ర్యాంకులు సాధించిన జబ్బా పావని, మచ్చా శ్రావణి, దేవత్ సంధ్యవిక, చిదిం మౌనిక, బానోతు కల్పన, పగిడిపల్లి రాజేశ్వరితో పాటు మహిళా ప్రాంగణం మేనేజర్ వేల్పుల విజేత, ఉద్యోగులు నాగ సరస్వతి, స్పందన, మల్లిక, సుధీర్, సుకన్య, మౌనిక, లాలయ్య పాల్గొన్నారు.
నైపుణ్యాల సాధనే కీలకం
ఖమ్మంరూరల్: విద్యార్థులు ఆసక్తి ఉన్న రంగాల్లో నైపుణ్యాలు సాధిస్తే జీవితంలో విజయాలు సొంతమవుతాయని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. పోలేపల్లిలోని పీఎంశ్రీ కేంద్రియ విద్యాలయంలో ఇన్నోవేషన్ అండ్ స్కిల్ సెంటర్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి వంటి వారు ఒకేరోజు గొప్పవారు కాలేదని, నిరంతర శిక్షణతోనే ఈ స్థాయికి చేరిన విషయాన్ని విద్యార్థులు గుర్తించి చదువుపై దృష్టి సారించాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్ కవీంద్రరాయ్‌తో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


