
సార్... ఇటూ చూడండి
నత్తనడకన సీతారామ ఎత్తిపోతల పథకం పనులు
అందుబాటులోకి రాని 100 పడకల ఆస్పత్రులు
హామీలకే పరిమితమైన యూనివర్సిటీ ఏర్పాటు
ఉమ్మడి జిల్లాను సన్యశ్యామలం చేసేలా తలపెట్టిన సీతారామ ఎత్తిపోతల పథకం పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. గత ఏడాది ఆగస్టు 15న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ములకలపల్లి మండలం పూసుగూడెం వద్ద సీతారామ పంపుహౌస్‌లో మోటార్లు స్విచాన్ చేశారు. ఈ వానాకాలం ఆరంభంలో గోదావరి నీటిని ఏన్కూరు లింక్ కెనాల్ ద్వారా వైరా రిజర్వాయర్‌లోకి వదిలారు. ఇవి తప్ప సీతారామ ప్రాజెక్టు పనులు ముందుకు సాగడం లేదు. సత్తుపల్లి ట్రంక్, పాలేరు లింక్ కాల్వ పనులు ఇంకా చేయాల్సి ఉంది. ప్రాజెక్టులో 8 డిస్ట్రిబ్యూటరీ ప్యాకేజీ పనులకు టెండర్లు ఆహ్వానించినా భూసేకరణ పూర్తికాలేదు. ప్యాకేజీ–9లోని యాతాలకుంట టన్నెల్, ప్యాకేజీ –13లో 213 ఎకరాల భూసేకరణ జరగకపోగా, ప్యాకేజీ–14లో 90 శాతం భూసేకరణ పూర్తయినా పనులు 15శాతం వద్దే ఉన్నాయి ప్యాకేజీ–15లో 80 శాతం, ప్యాకేజీ–16లో సగం పనులే పూర్తయ్యాయి. ఇటీవల అంచనా వ్యయాన్ని రూ.13,058 కోట్ల నుంచి రూ.19,325 కోట్లకు సవరించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో 3.29 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుతోపాటు 3.45 లక్షల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది.
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని వనరులు అందుబాటులో ఉన్నా అభివృద్ధి అంతంత మాత్రంగానే సాగుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పలు పథకాల అమలును వేగవంతం చేసేలా దృష్టి సారించారు. ఇందులో భాగంగా సీతారామ ఎత్తిపోతల పథకం అంచనా వ్యయాన్ని సవరించగా.. ప్రత్యేక శ్రద్ధ చూపితే తప్ప పనులు పూర్తయ్యే అవకాశం కానరావడం లేదు. ఇక ప్రభుత్వ ఆస్పత్రుల నిర్మాణం పూర్తయినా ప్రారంభానికి నోచుకోకపోగా, బుగ్గపాడులోని ఫుడ్‌పార్క్ అందుబాటులోకి రావడం లేదు. దశాబ్దాలుగా ఖమ్మంలో యూనివర్సిటీ ఏర్పాటు కోసం పోరాడుతున్నా అడుగు ముందుకు పడలేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనకు నేడు(బుధవారం) వస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి ఆయా సమస్యలపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
అధ్వానంగా రహదారులు
ఉమ్మడి జిల్లా మీదుగా ఏపీ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. దీంతో రోడ్లు నానాటికీ అధ్వానంగా మారుతున్నాయి. ఆర్‌అండ్‌బీ అధికారులు ఏటా మరమ్మతులు, రోడ్ల నిర్మాణానికి పంపిస్తున్న ప్రతిపాదనలు అమలుకు నోచుకోవడం లేదు. ఇటీవల హ్యామ్ నిధులు వస్తాయని చెప్పినా వీటితో మరమ్మతులే చేపట్టనున్నట్లు తెలుస్తోంది. తల్లాడ – ఖమ్మం, వైరా మండలం స్టేజీ పినపాక నుంచి ఏపీలోని ఎన్‌టీఆర్ జిల్లా నెమలికి వెళ్లే ప్రధాన రహదారి, పల్లిపాడు– ఏన్కూరు రహదారులు దారుణంగా దెబ్బ తిన్నాయి. ఏటా వర్షాకాలంలో వరదతో మరింత దెబ్బతింటున్నా అభివృద్ధికి నోచుకోవడం లేదు.
నేడు భద్రాద్రి జిల్లాలో
సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

సార్... ఇటూ చూడండి