
క్వార్టర్లు ఖాళీ చేయండి..
కేఎంసీ క్వార్టర్లల్లో నివసిస్తున్న వారికి నోటీసులు
రిటైర్డ్ ఉద్యోగులు, బయటి వారు
ఉండడం.. అదనపు నిర్మాణాలతో చర్యలు
50ఏళ్లుగా ఉంటున్న తాము
ఎక్కడకు వెళ్లాలంటూ ఆందోళన
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం నగర పాలక సంస్థ క్వార్టర్లను ఖాళీ చేయాలని అధికారులు జారీ చేసిన నోటీసులతో అక్కడ నివాసం ఉంటున్న వారిలో ఆందోళన మొదలైంది. జిల్లా కేంద్రంలోని రేవతి సెంటర్‌లో ఉన్న క్వార్టర్లలోలో 128 ఉంటుండగా, రెండు రోజుల క్రితం నోటీసులు ఇచ్చారు. రిటైర్డ్ ఉద్యోగులు, సిబ్బంది, బయట వ్యక్తులు ఉంటే వెంటనే ఖాళీ చేయాలని అందులో పేర్కొనగా.. ఏళ్ల తరబడి క్వార్టర్లలో ఉంటున్న తాము ఉన్న ఫలంగా ఎక్కడకు వెళ్లాలని వారు ఆందోళన చెందుతున్నారు.
60 ఏళ్ల క్రితం నిర్మాణాలు
ఖమ్మం మున్సిపాలిటీగా ఏర్పడిన సమయంలో ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికుల కోసం నగరంలోని మూడు ప్రాంతాల్లో క్వార్టర్లు నిర్మించారు. గుట్టల బజార్, ఎల్‌ఐసీ కార్యాలయం ప్రాంతాల్లోని క్వార్టర్లను అక్కడ ఉండే వారికే గతంలో క్రమబద్ధీకరించారు. ఇక రేవతిసెంటర్‌లోని 120 క్వార్టర్లు కార్పొరేషన్ ఆధీనంలోనే ఉన్నా అధికారులు పర్యవేక్షించకపోవడంతో అదనపు నిర్మాణాలు చేపట్టారని తెలుస్తోంది. ఇందులో భాగంగా క్వార్టర్లలో రిటైర్డ్ అయిన వారే కాక బయట వ్యక్తులు ఉంటున్నారనే ఫిర్యాదులు అధికారులకు అందినట్లు తెలిసింది. ఇంతలోనే నివాసముండే వారి వివరాలు ఇవ్వాలని ఓ వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేయడంతో కమిషనర్ దృష్టికి చేరింది. ఆపై చేపట్టిన సర్వేలో 128 క్వార్టర్లకు గాను, అదనంగా మరో 12కు పైగా నిర్మించి మొత్తం 140 కుటుంబాలు ఉంటున్నాయని తేలడంతో అధికారులు ఆగ్రహంగా ఉన్నారు.
ఏళ్ల తరబడి పట్టింపు లేక..
క్వార్టర్లలో ఉద్యోగ విరమణ చేసిన వారితో వారి బంధువుల కుటుంబాలు, ఇతర వ్యక్తులు నివాసం ఉంటున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. రిటైర్డ్ ఉద్యోగులను ఖాళీ చేయించి మరొకరికి క్వార్టర్ కేటాయించాల్సి ఉన్నా రెవెన్యూ విభాగం అధికారులు అలా చేయలేదు. ఇక క్వార్టర్లలో ఉన్న వారికి హెచ్‌ఆర్‌ఏ(హౌజ్ రెంట్ అలవెన్స్) సైతం మంజూరు చేశారనే ఆరోపణలున్నాయి. కొందరు 20ఏళ్ల క్రితం రిటైర్డ్ అయిన వారు ఉండడం, ఇప్పుడు బయటకు వెళ్లమనడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతన్నాయి.
సీపీఎం ఆధ్వర్యాన వినతి
మున్సిపల్ క్వార్టర్లను అందులో ఉంటున్న వారికే కేటాయించాలని సీపీఎం నాయకులు సోమవారం కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, మేయర్ పునుకొల్లు నీరజకు వినతిపత్రం అందజేశారు. దశాబ్దాల కాలంగా ఉంటున్న వారికి ప్రత్యామ్నాయం లేనందున ఖాళీ చేయమనడం సరికాదని వివరించారు. అంతా పేదలే అయినందున ప్రభుత్వ ధర ప్రకారం క్వార్టర్లను వారికే కేటాయించాలని కోరారు. కాగా, 2007లోనే తమ పార్టీ తరఫున చేసిన ప్రతిపాదననను నాటి పాలకవర్గం ప్రభుత్వానికి పంపించిందని సీపీఎం డివిజన్ కార్యదర్శి వై.విక్రమ్ తెలిపారు. మరోమారు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి క్వార్టర్లను అక్కడ ఉన్నవారికే కేటాయించాలని కోరారు.