
వ్యాపారుల పన్ను బకాయిలపై ఆరా
ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్ పరిధిలోని కొందరు వ్యాపారులు పన్ను ఎగవేసేలా వ్యవహరిస్తున్న తీరుపై అధికారులు దృష్టి సారించారు. ఈ విషయమై సోమవారం ‘సాక్షి’లో ‘పన్నుల ఎగవేతకు అడ్డదారులు’ శీర్షికన వచ్చిన కథనంతో స్పందించిన అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. రాష్ట్రంలోనే ఖమ్మం వ్యవసాయ మార్కెట్ నుంచి పంట ఉత్పత్తులను వివిధ రాష్ట్రాలకే కాక విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఏటా రూ.వేల కోట్ల విలువైన పంటల ఎగుమతులు జరుగుతుండగా.. వ్యాపారులు మార్కెట్‌కే కాక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నిర్దేశత పన్నులు చెల్లించాలి. కానీ కొందరు నకిలీ పర్మిట్లతో పన్నుల ఎగవేతకు పాల్పడుతున్నారు. ఈ విషయమై తాజాగా ఓ వ్యాపారిపై పోలీసు కేసు నమోదైంది. కొందరు నకిలీ పర్మిట్లు సృష్టిస్తుండగా, ఇంకొందరు ఒకే కుటుంబంలో నాలుగైదు లైసెన్సులను తీసుకుని రూ.కోట్ల వ్యాపారం చేస్తూ పన్ను ఎగ్గొట్టి, ఒకటి రద్దయినా ఇంకొకటి ఉపయోగిస్తున్నారు. ఇలా ఖమ్మం మార్కెట్‌లో 10 – 15 మంది వ్యాపారులు ఉన్నట్లు తెలుస్తుండగా రాజకీయ నాయకులుగా చెలామణి అవుతూ మార్కెట్‌కు రూ.2.50 కోట్ల మేర బకాయి పడ్డారు. ఈ మేరకు అధికారులు వ్యాపారుల లైసెన్సులను పరిశీలిస్తూనే, ఒకే కుటుంబంలో రెండుకు మించి ఉన్న లైసెన్సులపై ఆరా తీస్తున్నారు. అంతేకాక మార్కెట్ ఫీజు బకాయి పడిన వారి జాబితాను తయారుచేసి చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. తొలుత వ్యాపారులకు నోటీసులు జారీ చేసి వారి నుంచి వచ్చే సమాధానం ఆధారంగా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.
ఒకటికి మించి లైసెన్సు ఉంటే వివరాల సేకరణ