
ఇక సమరమే !?
సిద్ధంగా యంత్రాంగం
వచ్చేనెల 2న ఓటర్ల తుది జాబితా
షెడ్యూల్ విడుదల చేసిన
రాష్ట్ర ఎన్నికల సంఘం
స్థానిక సంస్థల ఎన్నికలకు
ఒక్కటొక్కటిగా ఏర్పాట్లు
ఖమ్మం సహకారనగర్: రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఒక్కటొక్కటిగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఓటర్ల తుది జాబితా ప్రకటన షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో త్వరలో ఎన్నికలు జరిగే అవకాశముందన్న ప్రచారం మొదలైంది.
ఈనెల 28న ముసాయిదా
జిల్లాలోని 20 మండలాల్లో 571 గ్రామపంచాయతీలకు గాను 5,214 వార్డులు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 8,02,690మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 3,88,244, మహిళలు 4,14,424, ఇతరులు 22మంది ఉన్నట్లు ఈ ఏడాది జూలై 1న విడుదల చేసిన జాబితా ద్వారా వెల్లడైంది. అయితే, మార్పులు, చేర్పుల అనంతరం తుది ఓటర్ల జాబితా విడుదలపై ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఇందులో భాగంగా ఈనెల 28వ తేదీన అన్ని గ్రామపంచాయతీల్లో ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటించాల్సి ఉంటుది. జిల్లా ఎన్నికల అధికారి ఆధ్వర్యాన ఈనెల 29న రాజకీయ పార్టీల నాయకులతో, 30వ తేదీన మండల స్థాయిలో ఎంపీడీఓలు సమావేశాలు నిర్వహించాలి. ఆపై ఓటర్ల జాబితా, వార్డుల విభజనపై ఈనెల 28నుంచి 30వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఆతర్వాత 31వ తేదీన అభ్యంతరాలను పరిష్కరించి, సెప్టెంబర్ 2వ తేదీన ఓటర్ల తుది జాబితా విడుదల చేయనున్నారు.
నూతనోత్సాహం
గ్రామపంచాయతీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయోనని ఆశావహులు ఎదురుచూపుల్లో ఉన్నారు. బీసీ రిజర్వేషన్ల అమలుపై స్పష్టత లేక ఎన్నికల నిర్వహణ ఆలస్యమవుతుందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యాన రాష్ట్రప్రభుత్వం కాంగ్రెస్ తరఫున రిజర్వేషన్ల అమలుపై ప్రకటన చేసింది. ఇంతలోనే ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితా ప్రకటనపై షెడ్యూల్ విడుదల చేయడంతో ఆశావహుల్లో ఒక్కసారిగా ఉత్సాహం మొదలైంది. వచ్చేనెల 2న ఓటర్ల తుది జాబితా విడుదలయ్యాక ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ విడుదల కావొచ్చని భావిస్తున్నారు. అంతేకాక వచ్చేనెల 30వ తేదీలోగా ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశాలు ఉండడంతో త్వరలోనే షెడ్యూల్ వస్తుందనే భావనతో ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు అధికార యంత్రాంగం చెబుతోంది. ఇప్పటికే జిల్లాలో ఉన్న బ్యాలెట్ బ్యాక్స్‌లకు తోడు ఇతర రాష్ట్రాల నుంచి సుమారు 3,500బాక్స్‌లు తెప్పించారు. అంతేకాక ఇతర సామగ్రి సమకూర్చుకున్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఉద్యోగులతో నివేదికలు సిద్ధం చేశారు.

ఇక సమరమే !?