
ఉపాధ్యాయుడికి బంగారు నంది అవార్డు
ఖమ్మం సహకారనగర్ : ముదిగొండ జెడ్పీ ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయుడు అవధానుల మురళీకృష్ణకు జాతీయస్థాయిలో బంగారు నంది అవార్డు లభించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌కు చెందిన కీర్తి ఆర్ట్ అకాడమీ వారు.. వివిధ రంగాల్లో పని చేస్తున్న వారి నుంచి అవార్డుల కోసం నామినేషన్లు స్వీకరించారు. అందులో విద్యా విభాగం నుంచి తనకు అవార్డు లభించినట్లు తెలిపారు. కాగా, ఈ అవార్డును కేంద్ర మాజీమంత్రి సముద్రాల వేణుగోపాల చారి, ఆధ్యాత్మికవేత్త దైవజ్ఞ శర్మ, అకాడమీ అధినేతల చేతులమీదుగా అందుకున్నానని చెప్పారు.
విద్యుత్ సేఫ్టీ
అధికారుల నియామకం
ఖమ్మంవ్యవసాయం : విద్యుత్ ప్రమాదాలను పూర్తిగా నివారించేందుకు గాను సేఫ్టీ అధికారులను నియమిస్తున్నట్లు విద్యుత్ సర్కిల్ ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సర్కిల్ పరిధిలో పనిచేసే టెక్నికల్ డీఈలను సేఫ్టీ అధికారులగా నియమించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. వినియోగదారులు, ముఖ్యంగా రైతుల్లో విద్యుత్‌పై అవగాహన పెంచడమే లక్ష్యంగా చైతన్య కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. రైతుల కోసం చేపట్టిన పొలంబాట కార్యక్రమంలో ఇప్పటివరకు 2,197 లూజ్‌లైన్లను పునరుద్ధరించామని, 1,510 స్తంభాలను సరి చేశామని, 2,296 అదనపు స్తంభాలను ఏర్పాటు చేశామని వివరించారు. విద్యుత్ సమస్యలు గుర్తిస్తే వినియోగదారులు, ప్రజలు 1912 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు.
పదోన్నతుల
జాబితా సిద్ధం
ఖమ్మం సహకారనగర్ : జిల్లాలో ఎస్‌జీటీల నుంచి ఎస్‌ఏ(స్కూల్ అసిస్టెంట్లు)లుగా పదోన్నతి పొందే వారి జాబితాను విద్యాశాఖ సిద్ధం చేసింది. ఈ మేరకు జిల్లాలో 1: 3 నిష్పత్తిలో సుమారు 600 మంది ఎస్‌జీటీలు ఉండగా 1:1 నిష్పత్తిలో వివిధ సబ్జెక్ట్‌లకు సంబంధించి 207 మందితో తుది జాబితా తయారు చేసి ఉన్నతాధికారులకు నివేదించారు. కాగా సోమవారం ఉదయం ఈ 207 మందికి వెబ్ ఆప్షన్లు మొదలయ్యే అవకాశం ఉన్నట్లు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.

ఉపాధ్యాయుడికి బంగారు నంది అవార్డు