
ఈవీ.. రయ్ రయ్!
జిల్లాలో ఎలక్ట్రిక్ వాహనాల వివరాలు..
టూ వీలర్ నుంచి పెద్ద వాహనాల వరకు.. 11 ఏళ్లలో నాలుగు వేల వెహికిల్స్ పర్యావరణ హితం కావడంతో సర్కారు ప్రోత్సాహం చార్జింగ్ స్టేషన్లు ఉంటే మరింతగా పెరగనున్న వాహనాలు
ఎలక్ట్రిక్ వాహనాలు బ్యాటరీల ద్వారా విద్యుత్‌శక్తితో నడుస్తాయి. వీటికి ఇంజన్లు ఉండవు. దీంతో వాయుకాలుష్యం చాలా తక్కువ. పర్యావరణ హితంగా ఉంటాయి. వీటిలో ఎటువంటి కాలుష్యాన్ని ఉత్పత్తి చేయని మోటార్ ఉంటుంది. ప్రస్తుత కాలంలో వాయుకాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ వాహనాలు పెరగడం ద్వారా వాతావరణ కాలుష్యం నివారించేందుకు వీలవుతుంది. ఇక వాహనాల నుంచి అతి తక్కువ శబ్దం రావడంతో పాటు ప్రయాణం చాలా మృదువుగా సాగుతుంది.
ఈ వాహనాలను చార్జింగ్ చేసేందుకు స్టేషన్ల కొరత ఉంది. రాష్ట్రంలో అతి తక్కువ ప్రాంతాల్లోనే చార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఇక జిల్లాలో ఈ చార్జింగ్ స్టేషన్లు అసలే లేవు. దీంతో వాహనాలను కొనుగోలు చేసిన వారు ఇంటివద్దే చార్జింగ్ పెట్టుకోవాల్సి వస్తోంది. మధ్య మధ్య చార్జింగ్ స్టేషన్లు లేకపోవడంతో ఎక్కువ దూరం ఈ వాహనాలపై ప్రయాణించలేకపోతున్నారు. అయితే రానున్న కాలంలో పలు ప్రాంతాల్లో స్టేషన్లు ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వాహనాల సంఖ్య పెరిగితే చార్జింగ్ స్టేషన్లు కూడా అనివార్యంగా రానున్నాయి. స్టేషన్లు ఏర్పాటు చేస్తే తక్కువ సమయంలో ఎక్కువ చార్జింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంట్లో వాహనాలకు చార్జింగ్ పెట్టాలంటే ఎక్కువ సమయం పడుతోందని యజమానులు చెబుతున్నారు.
సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇటీవలి కాలంలో వీటి ప్రయోజనాలు తెలుసుకునేందుకు వాహనదారులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. గతంలో పలు కారణాలతో ఈ వాహనాల కొనుగోళ్లు ఆశాజనకంగా లేవు. అయితే క్రమంగా సంప్రదాయ వాహనాలతోపాటు వీటికి కూడా డిమాండ్ ఏర్పడుతోంది. జిల్లాలో ప్రస్తుతం అన్ని రకాల ఎలక్ట్రిక్ వాహనాలు కలిపి 4,044 ఉన్నాయి. వీటిలో టూ వీలర్ల నుంచి పెద్ద వాహనాల వరకు ఉన్నాయి. ప్రధానంగా ఈ వాహనాలతో పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది. అయితే చార్జింగ్ స్టేషన్లు లేకపోవడంతో ఇబ్బంది అవుతోందని వినియోగదారులు అంటున్నారు. ఈ స్టేషన్లు ఏర్పాటైతే ఎలక్ట్రికల్ వాహనాల మార్కెట్ మరింతగా పెరిగే అవకాశం ఉంది.
ఈ వాహనాలకు రాయితీ..
ఎలక్ట్రికల్ వాహనాల్లో పలు రకాలున్నాయి. బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలు బ్యాటరీతో మాత్రమే పనిచేస్తాయి. హైబ్రీడ్ ఎలక్ట్రిక్ వాహనాలకు పెట్రోల్ ఇంజన్, బ్యాటరీ రెండూ ఉంటాయి. ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలు ప్లగ్ ఇన్ ద్వారా చార్జ్ చేయగల బ్యాటరీలను కలిగి ఉంటాయి. సంప్రదాయ వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రికల్ వాహనాల ధర ఎక్కువగానే ఉంది. అయితే ఈ వాహనాలు కొనుగోలు చేస్తున్న వారికి రవాణా శాఖ పలు రాయితీలు కల్పిస్తోంది. వీటికి లైఫ్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. అలాగే రిజిస్ట్రేషన్ ఫీజు కూడా లేదు.
జిల్లాలో 4,044 వాహనాలు..
జిల్లాలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య గతంతో పోలిస్తే భారీగా పెరిగింది. ఒకప్పుడు ఈ వాహనాల కొనుగోలుకు అనేక అనుమానాలు వ్యక్తం చేసిన ప్రజలు.. ప్రస్తుతం కొంత ఆసక్తి చూపుతున్నారు. రవాణా శాఖలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వివరాల ప్రకారం.. జిల్లాలో హెవీ, మీడియం, లైట్ ఎలక్ట్రికల్ వెహికిల్స్ మూడు ఉన్నాయి. ఇక త్రీ వీలర్ గూడ్స్ వాహనాలు 22 ఉన్నాయి. మోటారు సైకిళ్లు, స్కూటర్లు 3,731 ఉన్నాయి. టీజీఎస్ ఆర్టీసీ పలు జిల్లాల్లో ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెట్టింది. అయితే చార్జింగ్ స్టేషన్లు లేకపోవడంతో ఇంకా ఖమ్మం రీజియన్‌కు ఈ బస్సులు రాలేదు. ఇక జిల్లాలో సంప్రదాయ వాహనాలు 6,35,951 ఉన్నాయి. ఇందులో అధికంగా మోటారు సైకిళ్లు 4,60,476 ఉన్నాయి. అలాగే కార్లు 46,143 ఉన్నాయి. ఆటోలు 32,672 ఉన్నాయి.
వాహనం పేరు సంఖ్య
హెవీ,మీడియం,లైట్ వెహికిళ్లు 03
త్రీవీలర్ గూడ్స్ 22
ట్యాక్సీ క్యాబ్ 01
ఆటోలు 142
ప్రైవేట్ సర్వీస్ వాహనాలు 08
మోటారు సైకిళ్లు, స్కూటర్లు 3,731
ఎలక్ట్రిక్ కార్లు 137
మొత్తం 4,044
జిల్లాలో పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాలు