
ఆరోగ్యశ్రీ.. భారీ బాకీ
● జిల్లాలో నెట్‌వర్క్ ఆస్పత్రులకు రూ.50 కోట్లకు పైగానే.. ● ప్రభుత్వ ఆస్పత్రులకూ అందని నిధులు ● 31 నుంచి ఆరోగ్యశ్రీ సేవల బంద్‌కు పిలుపు
ఖమ్మంవైద్యవిభాగం: నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ పథకం రెండు అడుగులు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కు అన్నచందంగా తయారైంది. ఉమ్మడి రాష్ట్రంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ పథకాన్ని సక్రమంగా నిర్వహించకపోవడంతో లబ్ధిదారులు వినియోగించుకోలేకపోతున్నారు. జిల్లాలో ఈ పథకం పలు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉండగా.. గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆయా ఆస్పత్రులకు నిధులు విడుదల కావడం లేదు. దీంతో భారీగా చెల్లింపులు నిలిచిపోవడంతో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయాలని నిర్ణయించారు. అదే విధంగా ప్రభుత్వ ఆస్పత్రులకూ నిధులు రాకపోవడంతో పేషంట్లకు అందించాల్సిన సేవలపై ఆ ప్రభావం పడుతోంది. ఆయా నిధులు అందితే ప్రభుత్వాస్పత్రుల అభివృద్ధితో పాటు రోగులకు సదుపాయాలు కల్పించే ఆస్కారం లభిస్తుంది.
పరిమితి పెంపు.. చెల్లింపులు నిల్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెల్లరేషన్ కార్డు కలిగిన ప్రతీ కుటుంబానికి ఉచితంగా వైద్య సేవలు అందించేలా ఆరోగ్యశ్రీ సేవలను 2008లో అందుబాటులోకి తీసుకొచ్చారు. జిల్లాలో మొత్తం 7,12, 461 రేషన్ కార్డులు ఉండగా.. వీరందరూ ఈ పథకానికి అర్హులు. గతంలో రేషన్‌కార్డు కలిగిన కుటుంబసభ్యులకు రూ.5లక్షలలోపు వైద్యం పొందే అవకాశం ఉండేది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ఆ మొత్తాన్ని రూ.10లక్షలకు పెంచింది. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 1,835 రకాల వ్యాధులకు చికిత్సలు అందిస్తున్నారు. అయితే ఏడాదికి పైగా ప్రైవేటు(నెట్‌వర్క్) ఆస్పత్రులకు చెల్లింపులు జరగట్లేదు. ఆందోళన బాట పట్టినప్పుడు కంటి తుడుపుగా కొంత చెల్లించడం, ఆతర్వాత పట్టించుకోకపోవడం పరిపాటిగా మారింది. ఏడాదికి పైగా సర్జరీలకు సంబంధించి బకాయిలు పేరుకుపోవడంతో నెట్‌వర్క్ ఆస్పత్రుల నిర్వహణ కష్టంగా మారిందని, సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేకపోతున్నామని చెబుతున్నారు. దీంతో ఈనెల 31వ తేదీ అర్ధరాత్రి నుంచి ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. ఖమ్మం జిల్లాలో ఆరోగ్యశ్రీ బకాయిలు రూ. 50 కోట్లకు పైగా ఉంటాయని ఆస్పత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి.
జిల్లాలో 31 ఆస్పత్రులు..
బకాయిలు చెల్లించాలని, ప్యాకేజీలు పునర్‌సమీక్షించాలనే డిమాండ్‌తో నెట్‌వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ పిలుపునిచ్చింది. డిమాండ్లు పరిష్కరించకపోతే ఈనెల 31 అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయాలని నిర్ణయించింది. ఖమ్మం జిల్లాలో 31 ప్రైవేటు(నెట్‌వర్క్) ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలకు అనుమతి ఉంది. భారీగా బకాయిలు పేరుకుపోవడంతో ఆరోగ్యశ్రీ పథకంతో పాటు ఉద్యోగుల ఆరోగ్య పథకం, జర్నలిస్ట్ ఆరోగ్య పథకం కింద సేవలు బంద్ కానున్నాయి. జిల్లాలో రూ. 50 కోట్లకు పైగా బకాయిలు ఉండడంతో నిర్వహణ తమ వల్ల కావట్లేదని, ప్రభుత్వం క్రమంతప్పకుండా బకాయిలు చెల్లించాలని, ప్యాకేజీ ధరలను పెంచాలని యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే జిల్లాలో 8 ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు అందిస్తుండగా.. అందులో ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 90 శాతానికి పైగా ఆరోగ్యశ్రీ సేవలు అందుతాయి. మొత్తం 8 ఆస్పత్రులకు కలిపి రూ. 5.5 కోట్ల చెల్లింపులు రావాల్సి ఉండగా.. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి రూ. 5 కోట్లు ఇవ్వాల్సి ఉంది. అయితే ఖమ్మం ఆస్పత్రిలో కార్యాలయ నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఒక్కోసారి ఆరోగ్యశ్రీ రోగులకు మందులు ప్రైవేట్ నుంచి కొనుగోలు చేయాల్సి వస్తోంది. పెండింగ్ ఆరోగ్యశ్రీ నిధులు అయినా విడుదలైతే ఆస్పత్రి నిర్వహణ అయినా సక్రమంగా జరుగుతుందని అధికారులు చెబుతున్నారు.
ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులకు 14 నెలల బిల్లు బకాయి ఉంది. తద్వారా మందులు, నిర్వహణ ఖర్చులకు అప్పు చేయాల్సి వస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పరిమితిని రూ.10 లక్షలకు పెంచినా బిల్లులు మాత్రం చెల్లించట్లేదు. ఆస్పత్రులు నడిచే పరిస్థితి లేక ఈనెల 31నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేయాలని నిర్ణయించాం. ప్రజలను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం లేకున్నా ఇతర గత్యంతరం లేదు.
– డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు, శ్రీరక్ష ఆస్పత్రి

ఆరోగ్యశ్రీ.. భారీ బాకీ