
పన్నుల ఎగవేతకు అడ్డదారులు
● నకిలీ పర్మిట్లతో పంటల ఎగుమతి ● లైసెన్సులు మార్చి కొనుగోళ్లు.. ● ప్రభుత్వ ఖజానాకు రూ.కోట్లలో గండి ● రాజకీయ పలుకుబడితో అక్రమ దందా
ఖమ్మంవ్యవసాయం: పంట ఉత్పత్తుల క్రయ విక్రయాలు, ఎగుమతుల్లో వ్యాపారులు అడ్డదారులు తొక్కుతున్నారు. సర్కారుకు చెల్లించే పన్నుల ఎగవేతకు అక్రమ మార్గాలు అనుసరిస్తున్నారు. రైతుల నుంచి పంట కొనుగోళ్లు మొదలు ఇతర రాష్ట్రాలు, దేశాలకు జరిగే ఎగుమతుల వరకు ఈ దందా సాగుతోంది. కొందరు వ్యాపారులు నకిలీ ఎగుమతి పర్మిట్లు సృష్టించి వివిధ పంటలను ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. ప్రధానంగా దేశీయంగా జరిగే పంటల రవాణాలో ఈ దందా యథేచ్ఛగా సాగుతోంది. తద్వారా రూ.కోట్లలో పన్ను చెల్లింపులకు ఎగనామం పెడుతున్నారు. ఈ ఘటన ఖమ్మం వ్యవసాయ మార్కెట్ పరిధిలో వెలుగుచూసింది.
బిల్లుల్లో తేడాతో..
ఖమ్మంలోని ఎంకే ట్రేడర్స్ పేరుతో పంటలు కొనుగోలు చేసే మన్నం కృష్ణయ్య అనే వ్యాపారి 2023 నవంబర్‌లో నకిలీ ఎక్స్‌పోర్ట్ పర్మిట్లతో రూ.కోటి విలువైన 1,393 పత్తి బస్తాలు ఏపీలోని ఎమ్మిగనూరు మార్కెట్ పరిధిలోని ఓ సంస్థకు తరలించాడు. సంస్థ ఇన్‌పుట్ సబ్సిడీ కోసం ప్రయత్నించగా బిల్లులు ట్యాలీ కాకపోవడంతో అనుమానం వచ్చిన అధికారులు పర్మిట్లు పరిశీలించారు. దీంతో ఐదు లారీల్లో నకిలీ పర్మిట్లతో పత్తి రవాణా జరిగినట్లు గుర్తించారు. నకిలీ పర్మిట్లు ఖమ్మం మార్కెట్ నుంచి జారీ చేసినట్లు ఉండడంతో సదరు అధికారులు ఇక్కడికి వచ్చి పర్మిట్లను తనిఖీ చేయగా నకిలీవని బయటపడింది. వెంటనే కృష్ణయ్యపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదైంది. ఈ ఒక్క ఘటనలోనే సదరు వ్యాపారి మార్కెట్ ఫీజు(సెస్) రూ.లక్ష ఎగవేతకు పాల్పడగా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన జీఎస్టీకి కూడా మంగళం పాడే అవకాశం ఉంది. ఇలాంటి దందా జిల్లాలోని పలువురు వ్యాపారులు సాగిస్తున్నట్లు సమాచారం.
లైసెన్సులు మార్చి కొనుగోళ్లు..
పన్నుల కాలయాపన, ఎగవేతకు కొందరు వ్యాపారులు లైసెన్సులు మార్చి పంటలు కొనుగోలు చేస్తున్నారు. కుటుంబ సభ్యుల పేరిట మూడు, నాలుగు లైసెన్సులు తీసుకుంటూ వాటిలో ఒక లైసెన్స్‌తో రూ. కోట్ల విలువైన పంటలు కొనుగోలు చేసి ఎగుమతి చేస్తారు. వాటికి సంబంధించిన పన్నులు చెల్లించకుండా బకాయి పెడతారు. అధికారుల నుంచి నోటీసులు వస్తే మరో లైసెన్స్‌తో వ్యాపారంలోకి దిగుతారు. ఇలా కొందరు వ్యాపారులు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు రూ. లక్షల్లో ఫీజులు, జీఎస్టీలు బకాయి పడి ఉన్నారు. జిల్లాలో సమృద్ధిగా పంటలు పండుతున్నా మార్కెట్లకు ఏటా రూ. 63కోట్లు మాత్రమే పన్నులు వసూలవుతున్నాయి. రాష్ట్రంలో పెద్ద మార్కెట్లలో ఒకటైన ఖమ్మంలో ప్రధానంగా పత్తి, మిర్చి క్రయ, విక్రయాలు జరుగుతుంటాయి. వీటిలో మిర్చి విదేశీ ఎగుమతులు కూడా ఉంటాయి. దీంతో మార్కెట్ 1 శాతం పన్ను రూ. 30 కోట్లు ఉంటుంది. పంటల ధరలను వ్యాపారులు స్పష్టంగా బిల్లుల్లో పేర్కొంటే పన్నులు మరో రెండు రెట్లు పెరిగి రూ. 90 కోట్లకు చేరే అవకాశం ఉంది. అయితే కొందరు వ్యాపారులు పారదర్శకత పాటించకుండా మార్కెట్ పన్నుల్లో కోత విధిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో 225 మంది ఖరీదుదారులు ఉండగా వీరిలో 150 మంది వివిధ పంటలు కొనుగోలు చేసి దేశ, విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ఇందులో 10, 15 మంది వ్యాపారులు రూ.1.50 కోట్ల మేర పన్నులు బకాయి ఉన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు చూస్తే మొత్తంగా రూ. 2.50 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి.
రాజకీయ అండతోనే..
వ్యాపారులు వివిధ పార్టీల్లో నాయకులుగా, కార్యకర్తలుగా చెలామణి అవుతున్నారు. ఉన్నత పదువుల్లో ఉన్న వారి వెంట తిరుగుతూ.. వారి మనుషులమని చెప్పుకుంటూ తప్పుడు విధానాలకు పాల్పడుతున్నారు. తద్వారా సర్కారుకు చెల్లించాల్సిన పన్నులకే గండి కొడుతున్నారు. అధికారులు కూడా వారిని ప్రశ్నించాలన్నా, నోటీసులు జారీ చేయాలన్నా ఇబ్బంది పడుతున్నారు. వారి దందాను అడ్డుకునే ప్రయత్నం చేస్తే అధికారులపైనే నింద మోపుతూ ఇరకాటంలో పెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పంటల కొనుగోళ్లకు సంబంధించి మార్కెట్‌కు వ్యాపారులు చెల్లించాల్సిన 1 శాతం పన్ను చట్ట ప్రకారం, నిబంధనలు పాటిస్తూ వసూలు చేస్తాం. పాత బకాయిలపై దృష్టి సారించాం. నకిలీ ఎక్స్‌పోర్ట్ పర్మిట్లతో పంట ఎగుమతి జరిగినట్లు గుర్తించి ఓ ట్రేడింగ్ కంపెనీపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. అక్రమాలకు పాల్పడే వ్యాపారులపై చర్యలు తీసుకుంటాం. – పి ప్రవీణ్‌కుమార్,
ఖమ్మం మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి